నెల్లూరు (క్రైమ్): ఇదొక వింతైన దోపిడీ. ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగుడు తల్లి, కుమార్తెను బెదిరించి రూ.2.50 లక్షల విలువైన 76 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. తనకు రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే ఆభరణాలు ఇస్తానని దుండగుడు బాధితులతో బేరం పెట్టాడు. వారు డబ్బులు లేవనడంతో నగలతో పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున బాలాజీనగర్ రాంజీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కోటకు చెందిన పి.వెంకటకృష్ణారెడ్డి, శ్రీలత దంపతులు. వెంకటకృష్ణారెడ్డి బియ్యం వ్యాపారి.
ఆరు నెలల కిందట కుమార్తె అన్వేషకి వివాహ నిమిత్తం రాంజీనగర్‌కు వచ్చారు. కుమార్తె వివాహానంతరం వెంకట కృష్ణారెడ్డి కోటకు వెళ్లారు. కుమార్తె ఆషాఢ మాసం కావడంతో తల్లితో కలిసి రాంజీనగర్‌లోనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కిటికీ నుంచి కర్ర సాయంతో ఇంటి తలుపు గడియ తొలగించి ఇంట్లోకి వచ్చాడు. కప్‌బోర్డును తెరచి చూడగా అందులో ఏమీ కనిపించక పోవడంతో పడక గదిలో నిద్రిస్తున్న శ్రీలత, ఆమె కుమార్తెను నిద్రలేపి బంగారు ఆభరణాలు ఇవ్వాలని లేని పక్షంలో చంపుతామని బెదిరించాడు. శ్రీలత దిండుకింద ఉంచిన మూడున్నర సవర్ల బంగారు గొలుసు, ఆమె కుమార్తె మెడలోని 6 సవర్ల బంగారు గొలుసును లాక్కున్నాడు.
రూ.లక్ష ఇస్తే నగలిచ్చేస్తా..
ఘటనలో నిందితుడు బాధితులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు వ్యక్తిగత పనుల నిమిత్తం రూ.లక్ష అవసరమని, ఆ నగదు ఇస్తే దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment