
విద్యార్థి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ఆర్డీఓ, అధికారులు
నాయుడుపేటటౌన్: చిట్టమూరు మండలం తాడిమేడు గ్రామానికి చెందిన పిగిలాం శివమునిప్రతాప్ నాయుడుపేట గురుకులంలో 10వ తరగతి చదువుతూ అనుమానాస్పదంగా మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు పిగిలాం మునిరత్నం, వెంకటమ్మలు తల్లడిల్లిపోయారు. గురుకులంలో సక్రమంగా చదువు చెప్పడం లేదని, ఉపాధ్యాయులు చిత్రహింసలు పెడుతున్నారని తమ బిడ్డ చెప్పినప్పటికీ రెండు రోజులే గురుకులంలో ఉండాలని తెలిపామన్నారు.
టీసీ తీసుకెళ్లి వేరేచోట చేర్చుతామని చెప్పి వచ్చి 24 గంటలు గడవక ముందే తమ కొడుకు విగతజీవిగా ప్రభుత్వ వైద్యశాలలో ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యులతోపాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థి మృతిచెందినట్లు తెలుసుకున్న తాడిమేడు గ్రామస్తులతోపాటు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు, పలు ప్రజాసంఘాల వారు వైద్యశాలకు చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునిశివప్రతాప్ అనుమానాస్పదంగా మృతిచెందినట్లుగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.