యువకుడిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో తవ్వకాలు చేస్తున్న దృశ్యం తన్నీరు సురేష్‌గోపి (ఫైల్)
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్‌గోపి (25) అనే యువకుడిని మేనకూరు సేజ్ పరిధిలో కోనేటి రాజుపాళెం సమీపంలో దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన సురేష్‌కుమార్ బీటెక్ (సివిల్) పూర్తి చేశాడు. తమ ప్రాంతానికి చెందిన యార్ల తిరుపతిరావు అనే కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఓ కాంట్రాక్ట్‌కు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు నాయుడుపేట మండలం కోనేటిరాజుపాళెంలో ఉన్నాయని, అక్కడ సిబ్బందితో కలిసి పనిచేయాలని కాంట్రాక్టర్ అతడికి చెప్పాడు.
గోపి ఈనెల 22వ తేదీన నాయుడుపేటకు చేరుకున్నట్లు ఆరోజు రాత్రి తల్లి ధనలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. 23న గోపికి అతని కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్‌ను కలిసి తన కుమారుడు ఫోన్ పనిచేయడంలేదని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్ కోనేటిరాజుపాళెం వద్ద తేజ అనే సూపర్‌వైజర్ ఉన్నాడని, అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దీంతో గోపి కుటుంబసభ్యులు ఈనెల 25వ తేదీన కోనేటిరాజుపాళెం చేరుకుని విచారించగా సురేష్‌గోపి ఇక్కడకు రాలేదని తేజ వారికి చెప్పాడు. దీంతో వారు భయాందోళనకు గురైన అతని మేనమామ సిరిగిరి శ్రీనివాసులు అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు యువకుడు అదృశ్యమైనట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
హత్య చేసి పూడ్చిపెట్టారు
గోపి అదృశ్యమైన విషయమై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు సారథ్యంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జి.వేణులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు యువకుడిని అక్కడ పనిచేస్తున్న ఎవరో హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టినట్లుగా తెలుసుకున్నారు. దీంతో డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు సంస్థ సమీప ప్రాంతాల్లో బుధవారం తవ్వకాలు చేపట్టారు.
ఓ చోట దుర్వాసన వస్తుండటంతో తవ్వించారు. యువకుడి మృతదేహం బయటపడింది. కాగా గోపి కనిపించకుండా పోయినరోజు నుంచి అక్కడ పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్‌లు కూడా కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో హత్య వెనుక వారి ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గోపి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment