
మహేంద్రసింగ్ బంధువులనుంచి వివారాలు సేకరిస్తున్న ఎస్సై అల్లాభక్షు
సింహపురి ప్రశాంతతకు మారుపేరనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులు, కిడ్నాప్‌లతో అట్టుడుకుతోంది. జిల్లా ఓ వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోన్న తరుణంలో అంతే వేగంగా వ్యవస్థీకృత నేరాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఉగ్రవాదులు, మాఫియాలు, అంతర్రాష్ట్ర నేరగాళ్లు జిల్లాలో పాగావేసి తమ నేరసామ్రాజ్యాన్ని విస్తృతం చేస్తున్నారు. నేరగాళ్ల కదలికలను పసిగట్టడంలో నిఘా వ్యవస్థ విఫలమైందనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నేరగాళ్లు విజృంభిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.
నెల్లూరు(క్రైమ్): తుపాకీ కల్చర్ సైతం జిల్లాకు పాకింది. రోజురోజుకు తుపాకీ సంస్కృతి జడలు విప్పుతోంది. నెల్లూరు ఫత్తేఖాన్‌పేట సమీపంలో మహేంద్రసింగ్(47)అనే వ్యాపారిపై ఇద్దరు దుండగులు శనివారం రాత్రి కాల్పులు జరిపి హతమార్చడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసులు నిర్లిప్తత వీడకుంటే భారీగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఓ విశ్రాంత పోలీసు అధికారి వెల్లడించారు.
⇔ వెంకటేశ్వరపురంలోని ఓ బార్‌వద్ద అందరూ చూస్తుండగా రౌడీషీటర్ సాయి అలియాస్ బస్టాండు సాయిని స్నేహితులే అతికిరాతకంగా హతమార్చారు.
⇔ నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైవోవర్ బ్రిడ్జి సమీపంలో బిల్డర్ నెల్లూరు శిరీష్‌కుమార్‌ను ప్రత్యర్థులు కిరాయి హంతకులతో దారుణంగా హత్యచేయించారు.
⇔ పానీపూరిబండి వద్ద చెలరేగిన స్వల్పవివాదం కారణంగా ఇద్దరు పాతనేరస్తులు అన్నదమ్ములపై విచక్షణా రహితంగా దాడిచేశారు.
⇔ నగరంలోని కుమ్మరవీధికి చెందిన వడ్డీ వ్యాపారి తహసీన్‌ను నలుగురు మిఠాయిలో సైనెడ్‌కలిపి చంపి ఆమె మృతదేహాన్ని వెంకటాచలం సమీప అటవీప్రాంతంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమెకు చెందిన బంగారు, నగదు, ప్రామిసరీ నోట్లను అపహరించారు.
⇔ తాజాగా నగర నడిబొడ్డులో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో వ్యాపారి మహేంద్రసింగ్‌పై ఇద్దరు దుండగులు గన్‌తో కాల్పులు జరిపారు. ఈఘటనలో మహేంద్రసింగ్ మృతిచెందాడు.
వేళ్లూనుకుంటున్న కిరాయి సంస్కృతి
ఉత్తరాది రాష్ట్రాలు, మెగా సిటీలకే పరిమితమైన కిరాయి సంస్కృతి జిల్లాలోనూ పెరుగుతోంది. దుండగులు సుపారీ తీసుకుని ప్రత్యర్థుల ప్రాణాలను ఇట్టే తీసేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. కావలి డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి కోర్టువాయిదాకు వెళుతుండగా కిరాయిహంతకులు వేటకొడవళ్లతో దారుణంగా హత్యచేశారు. నెల్లూరు నగరంలో ఓ మహిళను ఆమె భర్తే సుపారీ ఇచ్చి హత్యచేయించాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అక్టోబర్ ఐదో తేదీన వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలతో బిల్డర్ శిరీష్‌కుమార్‌ను ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి దుండగులతో హత్యచేయించారు.
తనిఖీలు నామమాత్రం
జిల్లాలో క్రమేపి శాంతిభద్రతలు క్షీణదశకు చేరుకుంటున్నాయి. నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేరస్థులకు నెల్లూరు జిల్లా షెల్టర్ జోన్‌గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లోపించడం, తనిఖీలు నామమాత్రంగా ఉండటం నేరగాళ్లకు అనుకూలంగా మారింది. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పెద్ద ఎత్తున ఇతర ప్రాంత వాసులు జిల్లాకు తరలివస్తున్నారు. వారు ఎవరన్నది పోలీసుల వద్ద కచ్చితమైన సమాచారం లేదు. దీంతో కరుడుగట్టిన నేరగాళ్లు, ఉగ్రవాదులు, మవోయిస్టులు, స్మగ్లర్లు, ఆర్థిక నేరగాళ్లు జిల్లాలో తలదాచుకున్న ఘటనలు లేకపోలేదు. గతంలో సిమి ఉగ్రవాదులు జిల్లాలోని తడలో ఉన్నారనే సమాచారం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేసిన విషయం విదితమే. ఉగ్రవాదులు ఏకంగా కోర్టు ఆవరణలో బాంబులు పేల్చిన సంఘటన జిల్లాలో కలకలం రేకెత్తించింది. నగరానికి చెందిన ఇద్దరు యువకులు తాము డీ–గ్యాంగ్ సభ్యులమని ఏకంగా బీసీసీఐ సభ్యులు రాజీవ్‌శుక్లాకు ఫోనుచేసి ఏకంగా రూ.100కోట్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. ఇక ఎర్రస్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఏదైనా జరిగితేనే నాకాబందీ
దేశంలో లేదా రాష్ట్రంలో ఏదైనా కీలకమైన సంఘటన జరిగిన సమయంలో పోలీసులకు నాకాబందీ గుర్తొస్తుంది. నాకాబందీ అనేది పోలీసులు నెలలో కచ్చితంగా నాలుగుసార్లు చేయాలి. ఇది చాలా వరకు అమలు కావడం లేదు. పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీల్లో చాలాసార్లు కీలకమైన సమాచారం లభించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా పోలీసులు అధికారులు దీనిని గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక లైసెన్స్ తుపాకీలను సైతం మూడు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉంది. తుపాకీనీ ఈ మధ్యకాలంలో ఏవైనా వినియోగించారా? ఎన్ని బుల్లెట్లున్నాయి. అనే విషయంపై ఆరా తీయాలి. అయితే ఈ ప్రక్రియ తూతూమంత్రంగానే సాగుతుందనే విమర్శలున్నాయి. కేవలం ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లో పోలీసులు ఆయుదాలను జప్తు చేసుకుని ఆ నాలుగురోజులు శాంతిభద్రతలు కాపడుతున్నామని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రశాంత సింహపురి ఒకప్పటి మాటగానే మారింది. జిల్లా ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. వీటితో పాటు పోలీసుల పనితీరుపై విమర్శలకు పోలీసుశాఖ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే.
పెరుగుతున్న గన్‌కల్చర్
మారుతున్న కాలానికి అనుగుణంగా జిల్లాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఎవరి బతుకు వారిది..ఎవరి వ్యాపకాలు వారివి.. అయితే ఇటీవల అధికమైన తుపాకీ సంస్కృతి జిల్లా వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో గన్‌కల్చర్ పెరుగుతోంది. నేరగాళ్లు తుపాకీలతో కాల్చుతూ, వాటిని చూపిస్తూ ఘాతుకాలకు ఒడిగడుతున్నారు.
⇔ 2013 జూలై ఐదో తేదీన నెల్లూరు హాస్పిటల్ సమీపంలో పట్టపగలు మావోయిస్టు మాజీనేత, అమరవీరుల కుటుంబమిత్రుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు గంటిప్రసాదను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు.
⇔ 2015లో కావలికి చెందిన బంగారు వ్యాపారి రామయ్య, సునీల్ రూ. 86.55లక్షలు నగదుతో బంగారం కొనుగోలు చేసేందుకు నవజీవన్ రైల్లో వెళుతుండగా ఓ పోలీసు అధికారి(దొంగల ముఠా నాయకుడు) ఆధ్వర్యంలో ముగ్గురు కానిస్టేబుల్స్, ఓ పాతనేరçస్తుడు తుపాకులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు.
⇔ భూవివాదం నేపథ్యంలో తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆమలూరుకు చెందిన కిరణ్‌పై ఆయన సమీప బంధువు రూప్‌కుమార్ తుపాకీతోకాల్పులు జరిపారు.
⇔ 2015 ఆగస్టులో నెల్లూరు నగరంలోని దేవిరెడ్డివారివీధిలో జయంతి జ్యూయలరీస్‌లో దుండగులు లోనికి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని గన్‌లతో బెదిరించి రూ.లక్షలు విలువచేసే బంగారు నగలను అపహరించుకుని వెళ్లారు.
⇔ బిట్రగుంటలో టాస్క్‌ఫోర్సు పోలీసులపై తిరగబడ్డ దుండగులు వారి వద్దనున్న తుపాకీలను లాక్కొని పోలీసులపై దాడులుకు పాల్పడ్డారు.
⇔ ఇటీవల పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుంచి తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment