
బంధువులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్న ఏఎస్పీ, నగర డీఎస్పీ
నెల్లూరు (క్రైమ్): అంతా పది నిమిషాల వ్యవధిలో జరిగి పోయింది. దుకాణానికి తాళం వేసి ఇంటికి బయలుదేరిన మహేం ద్రసింగ్‌పై దుండగులు తూటా పేల్చి హతమర్చారు. తుపాకీ కాల్పుల ఘటన జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ సంచలనం రేకెత్తించింది. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్య వెనుక గల కారణాలను ఛేదించే పనిలో ఉన్నారు. నెల్లూరు నగరంలోని సీసీ కెమెరాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీ లించడంతో పాటు రాత్రంతా నగరంలో నాకా బందీ నిర్వహించారు. మృతుడికి రెండు సెల్‌ఫోను నంబర్లు ఉండటంతో కాల్ డీటైల్స్‌ను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి సమాచారం చెప్పకపోవడం, ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ (40) ది రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామం. ఆయనకు అదే జిల్లా లుద్దర గ్రామానికి చెందిన ఉషాదేవితో వివాహమైంది. మహేంద్రసింగ్ 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్‌పేట రైతుబజారు ఎదురు అక్కనవారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె కోమల్ పేరుతో సంతపేట, ఫత్తేఖాన్‌పేట, తిరుపతిలో పవర్ టూల్స్ సర్వీస్ అండ్ సేల్స్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని దుకాణ బాధ్యతలను ఆయన అన్న మంగిలాల్ రాజ్‌పురోహిత్ చూసుకుంటున్నాడు. మహేంద్రసింగ్ స్వతహాగా మృదు స్వభావి. అందరితో ఎంతో కలివిడిగా ఉం డేవారు. సామాజిక కార్యకర్త. తనకు ఉన్నదాంట్లోనే ధాన ధర్మాలు చేస్తుండటంతో పాటు స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తించారు. వినాయకచవితికి ఆయన తన స్వ గ్రామానికి ఒకటిన్నర నెల కిందట వెళ్లి రెండు వారాల కిందట తిరిగి నెల్లూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను దుండగులు హతమార్చడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
సంఘటన ఇలా..
ప్రతి రోజు మహేంద్రసింగ్ 9.30 గంటలకే దుకాణంను మూసివేసేవాడు. అయితే శనివారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసివేశాడు. దుకాణంలో పనిచేస్తున్న యువకులు ఇంటికి వెళుతుండగా వెనుక ఫోనుల్లో మాట్లాడుకొంటూ దుకాణం వద్ద నుంచి బయలుదేరారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆయనతో మాట్లాడి అతి దగ్గరగా రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వారి నుంచి తప్పిం చుకునే ప్రయత్నం చేయడంతో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి నిందితులు బైక్‌పై పరారైనట్లు సమాచారం.
ప్రొఫెషనల్స్ పనే
మహేంద్రసింగ్ హత్య ప్రొఫెషనల్స్ పని అయి ఉండొచ్చని, కిరాయి తీసుకుని హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన ప్రాంతంలో ల భ్యమైన తూటా కేస్‌ల ఆధారంగా ఫిస్టల్‌లో వినియోగించే 9 ఎంఎం బుల్లెట్లుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలో తుపాకీ సంస్కృతి లేకపోవడంతో నిందితులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారై ఉం టారని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యే క బృందాలతో విచారణ చేస్తున్నామని త్వరలోనే కేసులోని మిస్టరీని చేధిస్తామని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు.
మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
మహేంద్రసింగ్ మృతదేహానికి ఆదివారం ప్రభుత్వ వైద్యులు జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తి చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులను హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ సుభాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు
హత్య వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌లో మహేంద్రసింగ్ బావమరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి పోలీసులు సైతం ఆత్మహత్య కిందే పరిగణించి కేసును మూసివేశారు. అయితే ఇటీవల మహేంద్రసింగ్ తన బావమరిదిది ఆత్మహత్య కాదనీ, పలు అనుమానాలున్నాయని, కేసును పునః పరిశీలించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు తిరిగి ఆ కేసు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ హత్యకు గురికావడం వెనుక ఈ ఘటనే ఉండొచ్చన్న అనుమానాలను స్నేహితులు వ్యక్తం చేస్తున్నారు. మహేంద్రసింగ్ స్వగ్రామంలో ఓ యువతిని కొందరు కిడ్నాప్ చేసి హత్య చేశారని, అందులో మృతుడి ప్రమేయం ఉందనే ఆరోపణలు సైతం వెల్లు వెత్తుతున్నాయి. మహేంద్రసింగ్ తన స్వగ్రామంలో అనేక సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి వద్ద మంచి పేరును గడించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ దీన్ని జీర్ణించుకోలేక అతనితో తరచూ గొడవలు పడేవారని పోలీసులకు తెలిసింది.
దీంతో ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం రాజస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మహేంద్రసింగ్‌కు బంగారు వ్యాపారంలోనూ ప్రమేయం ఉంది. కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పడంతో అతని కోసం రోజుల తరబడి తిరిగి తర్వాత మానుకొన్నాడని బంధువులు పోలీసులకు వెల్లడించారు. నెల్లూరులో మహేంద్రసింగ్ షాపు ఉన్న చోట బిహార్‌కు చెందిన పానీపూరీ నిర్వాహకుడితో తార స్థాయిలో గొడవలు ఉన్నాయని పోలీసులకు సమాచారం. బిహార్‌లో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు పానీపూరీ నిర్వాహకుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత పోలీసులు నగదు కోసం హత్య చేసి ఉంటారని భావించారు. అయితే ఘటన జరిగిన సమయంలో అతని జేబులో సుమారు రూ 1.50 లక్షల నగదు ఉంది. నగదు కోసం హత్య చేసి ఉంటే దుండగులు ఆ నగదును అపహరించుకుని వెళ్లి ఉండేవారు. హత్యకు నగదు కారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులిద్దరిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment