తండ్రీకొడుకులు.. ఘరానా దొంగలు | Father And Son Theft Case In Nellore | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులు.. ఘరానా దొంగలు

Published Sun, Jun 2 2019 1:07 PM | Last Updated on Sun, Jun 2 2019 1:07 PM

Father And Son Theft Case In Nellore - Sakshi

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): పలు చోరీలకు, నేరాలకు పాల్ప డుతూ హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్న ఓ తండ్రి తన కుమారుడితో కలిసి దొంగతనాలకు పాల్పడుతుండగా వీరిద్దరినీ ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని జిల్లా నూతన పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా ఆటోలు, బైక్‌లు చోరీకి గురవుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. సీసీఎస్‌ అధికారులకు ఎస్పీ ఆదేశాలివ్వడంతో ఏఎస్పీ పరమేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నెల్లూరు సీసీఎస్‌ సీఐ ఎస్‌కే బాజీ జాన్‌సైదా, నెల్లూరురూరల్‌ సీఐ జీఎల్‌ శ్రీనివాసరావు తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉంచారు.

ఈ క్రమంలో శనివారం ఆరో మైలు, యాగర్లసెంటర్‌ వద్ద అనుమానంతో ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళేనికి చెందిన తండ్రీకొడుకులైన దొడ్ల సంతోష్, దొడ్ల సందీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జిల్లాలోనే కాక ఇతర జిల్లాలో కూడా ఆటోలు, బైక్‌లు చోరీచేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 10 అపే ఆటోలు, రూ.5 లక్షల విలువ చేసే 8 బైక్‌లు, రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణం, చైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దొడ్ల సంతోష్‌ గతంలో పలు చోరీలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉంటూ ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడని తెలిపారు. హత్య కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటి నుంచి తన కొడుకు సందీప్‌తో కలసి మరిన్ని చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ ఘరానాదొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన నెల్లూరు సీపీఎస్‌ సీఐ ఎస్‌కే బాజిజాన్‌సైదా, రూరల్‌ పీఎస్‌ సీఐ జీఎల్‌ శ్రీనివాసరావు, క్రైంబ్రాంచ్‌ ఏఎస్‌ఐ జె.వెంకయ్య, హెడ్‌కానిస్టేబుల్స్‌ ఎస్‌డీ వారిస్‌ అహ్మద్, పి.విజయ్‌ప్రసాద్, ఆర్‌.సత్యయనారా యణ, కానిస్టేబుల్స్‌ జి.నగేష్, ఎం.సుబ్బారావు, జి.అరుణ్‌కుమార్, ఎం.వేణు, సీహెచ్‌ శ్రీనులను ఎస్పీ అభినందించి సర్వీస్‌ రివార్డులు అందజేశారు.

తండ్రీకొడుకులు చేసిన చోరీల వివరాలు

  • ఇందుకూరుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2017వ సంవత్సరంలో నిడుముసలి గ్రామంలో నిద్రపోతున్న ఓ మహిళ మెడలో రూ.2 లక్షల  విలువైన తొమ్మిదిన్నర సవర్ల బంగారు ఆభరణం, చైన్‌ను అపహరించారు. నరసాపురం గ్రామంలో ఒక ఆటో చోరీ చేశారు. గంగపట్నం గ్రామంలోని వేపచెట్టు దర్గా వద్ద ఓ ఆటోను చోరీ చేశారు.
  • వెంకటాచలసత్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొలగమూడి గ్రామంలో రెండు ఆటోలు అపహరించారు.
  • బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుచ్చిరెడ్డిపెలెం సెంటర్‌లో రెండు ఆటోలు చోరీ చేశారు.
  • కోవూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇనమడుగు ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్ద ఓ ఆటోను చోరీ చేశారు. వేగూరుకండ్రిగ వద్ద ఒక ఆటోను చోరీ చేశారు.
  • చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు, రేణిగుంట, వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రెండు ఆటోలు, 8 బైక్‌లు చోరీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement