మాట్లాడుతున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి
నెల్లూరు, వెంకటాచలం: పనిచేసే చోట సొంత తమ్ముడి కంటే బయటి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఓ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆధిపత్యం కోసం మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. ఈ కేసును వెంకటాచలం పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మంళవారం వెంకటాచలం పోలీసుస్టేషన్‌లో నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగరంలోని కొరడావీధికి చెందిన షేక్ సుభానీ (35) అనే వ్యక్తి షేక్ జమీర్ బంగారు నగల దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడ సుభానీతోపాటు జమీర్ సోదరుడు షేక్ షామీర్, షేక్ మీరామొహిద్దీన్ పనిచేస్తున్నారు. సుభానీ పనితీరు బాగా నచ్చడంతో యజమాని జమీర్ ఎక్కువగా అతడినే నమ్మేవాడు.
జమీర్ తాను బయటికి వెళ్లేప్పుడు బంగారు నగలు దాచే లాకర్ తాళాలు, ఇతర వ్యవహారాలు సుభానికే అప్పజెప్పేవాడు. దీంతో షామీర్ సుభానీపై కక్ష పెంచుకుని ఎలాగైనా అతడి అడ్డుతొలగించాలని మీరామొహిద్దీన్‌తో కలిసి కుట్ర పన్నాడు. ఈనెల 7వ తేదీన షామీర్, మీరామొహిద్దీన్ కలిసి సుభానీని కసుమూరు దర్గాకు వెళదామని నమ్మబలికి తీసుకెళ్లారు. వెంకటాచలం దాటిన తర్వాత చాకిరేవుమడుగు వద్దకు తీసుకెళ్లి వారి వెంట తీసుకువచ్చిన పొదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతుకోసి హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని వద్దనున్న దుకాణం లాకర్ తాళాన్ని తీసుకుని చాకిరేవుమడుగులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈనెల 12వ తేదీన చాకిరేవుమడుగులో కుళ్లిన మృతదేహం ఉందని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాచలం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు.
ఇలా బయటపడింది
హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈనెల 16వ తేదీన జమీర్ బంగారు నగల దుకాణంలో షామీర్, మీరామొహిద్దీన్ కలిసి లాకర్ తాళాలు తీసి 300 గ్రాముల బంగారు నగల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజీలో బయటపడింది. దీంతో జమీర్ వారిద్దరిపై నిఘా పెట్టాడు. ఈక్రమంలో గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వారి నుంచి చోరీ చేసిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నాడు. కాగా 7వ తేదీ నుంచి సుభానీ కనిపించకపోవడంతో వీరికి అసలు విషయం తెలిసి ఉండొచ్చని జమీర్ భావించాడు. సుభానీ విషయంలో నిజాలను పోలీసులకు చెపాల్పని వారికి చెప్పగా అక్కడినుంచి పరారయ్యారు. దీంతో జమీర్ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం షామీర్, మీరామొహిద్దీలను రూరల్ సీఐ కె.రామకృష్ణ తనసిబ్బందితో నిఘా ఉంచి నెల్లూరులోని జిల్లా కోర్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే హత్య చేసినట్లుగా తేలింది. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. హత్యకేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్సై కరిముల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment