నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు ఆత్మకూరుకు చెందిన వేణు మృతదేహం ఇన్‌సెట్‌లో వేణు (ఫైల్)
నాయుడుపేటటౌన్(నెల్లూరు): ముందు వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఆత్మకూరుకు చెందిన చెరువుపల్లి వేణు (33) అనే ప్రయాణికుడు మృతిచెందిన ఘటన నాయుడుపేట మండల అన్నమేడు జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా, 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు చెందిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన షేక్ సుభానీ డ్రైవర్ కమ్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తిరుపతి నుంచి నెల్లూరు వరకు వెళ్లే బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో నెల్లూరు నుంచి తిరుపతికి 16 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. బస్సులో ఖాళీగా ఉందని గూడూరు వద్ద ఆత్మకూరు పట్టణానికి చెందిన చెరువుపల్లి వేణు (33) అనే వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అతను డ్రైవర్ ఎడమవైపు కూర్చున్నాడు.
జాగ్రత్తగా నడపాలని చెప్పినా..
కాగా డ్రైవర్ కునుకు తీస్తూ బస్సు నడుపుతుండటంతో ప్రయాణికులు జాగ్రత్తగా నడపాలని సూచనలు ఇచ్చారు. బస్సు మార్గమధ్యంలో మండల పరిధిలోని అన్నమేడు జాతీయ రహదారి కూడలి వద్ద ముందు వెళుతున్న సిమెంట్‌లోడు లారీని వేగంగా ఢీకొంది. దీంతో బస్సు ఎడమవైపు నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరగడంతో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న వేణు ఇరుక్కుని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంకా బస్సులో ఉన్న నాయుడుపేటలోని రజక కాలనీకి చెందిన రమేష్ అనే వ్యక్తితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా 13 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బస్సు ఎడమ వైపు శకలాల్లో ఇరుక్కున్న మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సల్పగాయాలతో ఉన్న వారిని మరో బస్సులో పంపించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదుచేశారు. వేణు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రభుత్వ వైద్యశాల వద్ద విషాదఛాయలు
ఆత్మకూరు పట్టణంలో సెలూన్ షాపు నిర్వహించుకునే వేణు దైవదర్శనం చేసుకునేందుకు వెళుతూ మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నాయుడుపేట వైద్యశాలకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment