సాక్షి, నెల్లూరు : ఆ టీవీలు పైకి పెద్ద కంపెనీవి. కానీ అవి లోకల్‌గా తయారుచేసిన సెట్లు. బ్రాండెడ్ కంపెనీ పేరుతో అసెంబుల్డ్ టీవీలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు సీసీఎస్, నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువచేసే 72 టీవీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామిలీ జిల్లా కిరానా తాలుకాకు చెందిన పఠాన్ షబ్బీర్‌ఖాన్, ముజ్ఫర్ నగర్ జిల్లా బుదాస్ తాలూకాకు చెందిన అబ్దుల్ రహిమాన్‌లు స్నేహితులు. వీరు వివిధ రాష్ట్రాల్లో గ్యాస్ స్టౌలు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. సంపాదన అంతంతమాత్రంగానే ఉండడంతో తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించాలని నిర్ణయించుకున్నారు.
రూ.4 వేలు లోపే..
షబ్బీర్‌ఖాన్, అబ్దుల్ ఢిల్లీలోని చాందినీచౌక్‌లో స్థానికంగా తయారుచేసే (అసెంబుల్డ్) టీవీలను అతి తక్కువ ధరకు (రూ.3 వేల నుంచి రూ.4 వేల లోపు) పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. వాటి మీద వివిధ టీవీల కంపెనీల పేరున్న స్టిక్కర్లను అతికించారు. కంపెనీ టీవీలంటూ ప్రజలకు ఒక్కో దానిని రూ.15 నుంచి రూ.20 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకోసాగారు.
ఇటీవల నిందితులు టీవీలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నెల్లూరుకు తరలించి వెంకటేశ్వరపురం ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఇంట్లో నిల్వ చేశారు. వాటికి సోనీ కంపెనీ స్టిక్కర్లను అంటించారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కంపెనీ టీవీలని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేయసాగారు.
పక్కా సమాచారంతో..
వారిద్దరి నిర్వాకంపై సీసీఎస్, నవాబుపేట ఇన్‌స్పెక్టర్లు షేక్ బాజీజాన్ సైదా, కె.వేమారెడ్డిలకు పక్కా సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి వారు తమ సిబ్బందితో కలిసి టీవీలు నిల్వచేసిన ఇంటిపై దాడిచేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, విక్రయాలకు సిద్ధంగా ఉంచిన రూ.25 లక్షలు విలువచేసే టీవీలను, సోనీ కంపెనీ పేరున్న స్టిక్కర్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
వారిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సీసీఎస్, నవాబుపేట ఇన్‌స్పెక్టర్లు బాజీజాన్‌సైదా, వేమారెడ్డి, ఎస్సై మరిదినాయుడు, సీసీఎస్ ఏఎస్సై గిరిధర్‌రావు, హెడ్‌కానిస్టేబుల్స్, జీవీ రమేష్, సీహెచ్ వెంకటేశ్వర్లు, టి.విజయకుమారి, కానిస్టేబుల్స్ పి.సతీష్, పీవీ సాయిఆనంద్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీసీఎస్, నవాబుపేట పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment