నేరస్తులు మొదలుకుని అనుమానితుల వరకు ప్రతిఒక్కరితో సెల్ఫీ దిగాలి. రాత్రి డ్యూటీలో ఉండే పోలీసులు వారి లోకేషన్‌ను షేర్ చేయాలి. పోలీసులకు సెల్ఫీలు, లోకేషన్లతో ఏం పని. ఇదేదో వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఒక వినూత్న ప్రయోగం. ఇది జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ ఐశ్యర్య రస్తోగి కొత్త రూల్. సరికొత్త పోలిసింగ్ మొదలైంది. టెక్నాలజీకి కాస్త దూరంగా ఉండే పోలీసులు కూడా దానినే పూర్తిగా నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తకొత్త మార్పులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా తప్పనిసరి. పోలీస్ బాస్ ఆదేశాలతో పోలీసులందరూ సెల్ఫీల బాట పడుతున్నారు. విజిబుల్ పోలీసింగ్ పక్కా అమలు కోసమే ఈ సెల్ఫీ పోలీసింగ్.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ఎస్పీ ఐశ్యర్య రాస్తోగి టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా ఈ–బీట్ సిస్టమ్‌ను అమలులోకి తేవడం, అలాగే విజిబుల్ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించి సరికొత్త విధానానికి తెరతీశారు. ఆయా స్టేషన్ పరిధిలోని ఎస్సైలు, సీఐలు నిత్యం వారి పరిధిలోని దొంగలు మొదలుకుని రౌడీషీటర్ల వరకు అందరి ఇళ్లు ఒక్కసారి తనిఖీ చేయాలి. తనిఖీలు చేసినట్లు ఆధారం కోసం అక్కడ వారితో ఒక సెల్ఫీ దిగి జిల్లా ఎస్పీ నంబర్‌కు నిత్యం వాట్సాప్ చేయాలి. అలాగే ఈ–బీట్‌లో కూడా నిత్యం కేటాయించిన డ్యూటీల ప్రాంతంలో తిరగుతున్నట్లు సంబంధిత ప్రాంతంలో ఉన్నట్లు లోకేషన్‌ను షేర్ చేయాలి.
ఇందుకోసమే..
జిల్లాలో 22 సర్కిళ్ల పరిధిలో, 62 పోలీసు స్టేషన్లున్నాయి. నేరాల తీవ్రత ఎక్కువగానే ఉంది. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో నగరంలోనే మూడు హత్యలు జరిగాయి. అలాగే జిల్లాలో అత్యధికంగా 135 కిలో మీటర్లు జాతీయ రహదారి ఉంది. సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉంది. వీటితోపాటు సెజ్‌లు, కృష్ణపట్నం పోర్టు ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల నేరా లు అధికంగానే జరుగుతున్నాయి. ముఖ్యం గా జాతీయ రహదారిపై ప్రమాదాలైతే నెల కు సగటున 10కి పైగా జరుగుతున్నాయి. ఈ ప్రభావమంతా పూర్తి స్థాయిలో పోలీసులపైనే ఉంటుంది. ఈక్రమంలో విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీసు గస్తీలో నిరంతరం రోడ్డుపై కనబడడంతో కొంతమేరకు నేరాలు తగ్గుముఖం పడతాయని యోచన.
సునిశిత పరిశీలన ..
ఇప్పటివరకు వారానికి ఒకసారి రౌడీషీటర్లు పోలీసు స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత వారంరోజులపాటు వారి కదలికలపై ఎలాంటి నిఘా ఉండని పరిస్థితి. ఏదైనా ప్రాంతంలో గొడవ జరిగితే, దాడులు జరగ్గానే రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించడం పరిపాటిగా జరగుతోంది. అలాగే దొంగలు, సస్పెక్ట్ షీటు ఉన్నవారు ఇలా అందరిపైనా నామామత్రపు నిఘా ఉండేది తప్ప పూర్తిస్థాయి కొనసాగేది కాదు. కానీ పోలీసు రికార్డుల ప్రకారం మాత్రం సదరు వ్యక్తులపై నిరంతర నిఘా ఉన్నట్లు జీడీ కానిస్టేబుల్స్ పరిశీలిస్తున్నట్లు నివేదికల్లో ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్ లేకపోవటంతో నగరంలో ఆకతాయిల అల్లర్ల నుంచి హత్యల వరకు అన్ని జరగుతున్నాయనేది పోలీసులే చెబుతున్న మాట. జిల్లాలో 62 స్టేషన్ల పరిధిలో 250 మంది డీసీలు (డెకాయిటీ షీట్లు) కేడీలు, సస్పెక్టెడ్ షీటర్లు ఉన్నారు. అలాగే నెల్లూరు నగరంలో 152 మంది రౌడీషీటర్లు ఉన్నారు. జిల్లాలో మరో 75 మంది ఉన్నారు.
ఎక్కడైనా నేరం జరిగినా, దొంగతనం జరిగినా వీరి పాత్ర ఎంతోకొంత ఉంటుంది. ఈక్రమంలో ఆయా పరిధిలోని పోలీసులు నిరంతర నిఘా వల్ల కొంత నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశంతో పాటు వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సై మొదలుకుని డీఎస్పీ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారా లేదా అనేది వైర్‌లెస్ సెట్ ద్వారా మాత్రమే ఇప్పటివరకు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలో ఎలాంటి ఖర్చు లేకుండా విజిబుల్ పోలీసింగ్. ఈ–బీట్ అమలులో భాగంగానే సెల్ఫీ విధానానికి గత వారంలో తెరతీశారు. ఎస్సై మెదలుకుని డీఎస్పీ వరకు అందరూ ఆయా స్టేషన్ల పరిధిలో నేరస్తులపై నిరంతర నిఘా ఉంచుతున్నారని, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నారని తెలియడం కోసం నేరస్తుడితో లేదా అతని ఇంటి వద్ద సోదాలు చేసినట్లు సెల్ఫీలు దిగాలని ఆదేశించారు. పోలీసులకు ఇది కొంత కొత్తగా ఉన్నా బాస్ ఆర్డర్ కావటంతో అలవాటు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment