Nellore SP
-
నెల్లూరు.. ‘ఓటు’ను తెలుసుకో..!
సాక్షి, నెల్లూరు: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. - ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
సెల్ఫీ పోలిసింగ్
నేరస్తులు మొదలుకుని అనుమానితుల వరకు ప్రతిఒక్కరితో సెల్ఫీ దిగాలి. రాత్రి డ్యూటీలో ఉండే పోలీసులు వారి లోకేషన్‌ను షేర్ చేయాలి. పోలీసులకు సెల్ఫీలు, లోకేషన్లతో ఏం పని. ఇదేదో వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఒక వినూత్న ప్రయోగం. ఇది జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ ఐశ్యర్య రస్తోగి కొత్త రూల్. సరికొత్త పోలిసింగ్ మొదలైంది. టెక్నాలజీకి కాస్త దూరంగా ఉండే పోలీసులు కూడా దానినే పూర్తిగా నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తకొత్త మార్పులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా తప్పనిసరి. పోలీస్ బాస్ ఆదేశాలతో పోలీసులందరూ సెల్ఫీల బాట పడుతున్నారు. విజిబుల్ పోలీసింగ్ పక్కా అమలు కోసమే ఈ సెల్ఫీ పోలీసింగ్. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ఎస్పీ ఐశ్యర్య రాస్తోగి టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా ఈ–బీట్ సిస్టమ్‌ను అమలులోకి తేవడం, అలాగే విజిబుల్ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించి సరికొత్త విధానానికి తెరతీశారు. ఆయా స్టేషన్ పరిధిలోని ఎస్సైలు, సీఐలు నిత్యం వారి పరిధిలోని దొంగలు మొదలుకుని రౌడీషీటర్ల వరకు అందరి ఇళ్లు ఒక్కసారి తనిఖీ చేయాలి. తనిఖీలు చేసినట్లు ఆధారం కోసం అక్కడ వారితో ఒక సెల్ఫీ దిగి జిల్లా ఎస్పీ నంబర్‌కు నిత్యం వాట్సాప్ చేయాలి. అలాగే ఈ–బీట్‌లో కూడా నిత్యం కేటాయించిన డ్యూటీల ప్రాంతంలో తిరగుతున్నట్లు సంబంధిత ప్రాంతంలో ఉన్నట్లు లోకేషన్‌ను షేర్ చేయాలి. ఇందుకోసమే.. జిల్లాలో 22 సర్కిళ్ల పరిధిలో, 62 పోలీసు స్టేషన్లున్నాయి. నేరాల తీవ్రత ఎక్కువగానే ఉంది. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో నగరంలోనే మూడు హత్యలు జరిగాయి. అలాగే జిల్లాలో అత్యధికంగా 135 కిలో మీటర్లు జాతీయ రహదారి ఉంది. సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉంది. వీటితోపాటు సెజ్‌లు, కృష్ణపట్నం పోర్టు ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల నేరా లు అధికంగానే జరుగుతున్నాయి. ముఖ్యం గా జాతీయ రహదారిపై ప్రమాదాలైతే నెల కు సగటున 10కి పైగా జరుగుతున్నాయి. ఈ ప్రభావమంతా పూర్తి స్థాయిలో పోలీసులపైనే ఉంటుంది. ఈక్రమంలో విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీసు గస్తీలో నిరంతరం రోడ్డుపై కనబడడంతో కొంతమేరకు నేరాలు తగ్గుముఖం పడతాయని యోచన. సునిశిత పరిశీలన .. ఇప్పటివరకు వారానికి ఒకసారి రౌడీషీటర్లు పోలీసు స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత వారంరోజులపాటు వారి కదలికలపై ఎలాంటి నిఘా ఉండని పరిస్థితి. ఏదైనా ప్రాంతంలో గొడవ జరిగితే, దాడులు జరగ్గానే రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించడం పరిపాటిగా జరగుతోంది. అలాగే దొంగలు, సస్పెక్ట్ షీటు ఉన్నవారు ఇలా అందరిపైనా నామామత్రపు నిఘా ఉండేది తప్ప పూర్తిస్థాయి కొనసాగేది కాదు. కానీ పోలీసు రికార్డుల ప్రకారం మాత్రం సదరు వ్యక్తులపై నిరంతర నిఘా ఉన్నట్లు జీడీ కానిస్టేబుల్స్ పరిశీలిస్తున్నట్లు నివేదికల్లో ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్ లేకపోవటంతో నగరంలో ఆకతాయిల అల్లర్ల నుంచి హత్యల వరకు అన్ని జరగుతున్నాయనేది పోలీసులే చెబుతున్న మాట. జిల్లాలో 62 స్టేషన్ల పరిధిలో 250 మంది డీసీలు (డెకాయిటీ షీట్లు) కేడీలు, సస్పెక్టెడ్ షీటర్లు ఉన్నారు. అలాగే నెల్లూరు నగరంలో 152 మంది రౌడీషీటర్లు ఉన్నారు. జిల్లాలో మరో 75 మంది ఉన్నారు. ఎక్కడైనా నేరం జరిగినా, దొంగతనం జరిగినా వీరి పాత్ర ఎంతోకొంత ఉంటుంది. ఈక్రమంలో ఆయా పరిధిలోని పోలీసులు నిరంతర నిఘా వల్ల కొంత నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశంతో పాటు వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సై మొదలుకుని డీఎస్పీ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారా లేదా అనేది వైర్లెస్ సెట్ ద్వారా మాత్రమే ఇప్పటివరకు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలో ఎలాంటి ఖర్చు లేకుండా విజిబుల్ పోలీసింగ్. ఈ–బీట్ అమలులో భాగంగానే సెల్ఫీ విధానానికి గత వారంలో తెరతీశారు. ఎస్సై మెదలుకుని డీఎస్పీ వరకు అందరూ ఆయా స్టేషన్ల పరిధిలో నేరస్తులపై నిరంతర నిఘా ఉంచుతున్నారని, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నారని తెలియడం కోసం నేరస్తుడితో లేదా అతని ఇంటి వద్ద సోదాలు చేసినట్లు సెల్ఫీలు దిగాలని ఆదేశించారు. పోలీసులకు ఇది కొంత కొత్తగా ఉన్నా బాస్ ఆర్డర్ కావటంతో అలవాటు చేసుకుంటున్నారు. -
ఎస్పీ వ్యాఖ్యలతో నెల్లూరులో ఉద్రిక్తత
♦ ఓ వర్గం ఆగ్రహం.. ఎస్పీ వాహనంపై దాడి ♦ గాలిలోకి కాల్పులు జరిపిన గన్‌మన్ సాక్షి, నెల్లూరు: నెల్లూరు ఎస్పీ గజరావుసింగ్ భూపాల్ వ్యాఖ్యలపై ఓ వర్గానికి చెందినవారి ఆందోళన పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో నెల్లూరు ఎస్పీ శుక్రవారం ఓ వర్గానికి చెందిన వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాటలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని భావించిన ఆ వర్గానికి చెందిన యువకులు శనివారం పెద్దలతో సమాలోచనలు జరిపారు. ఎస్పీ వ్యాఖ్యలకు నిరసన తెలపాలని సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో మున్వర్ అనే నేతను పోలీసులు నెల్లూరు ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది యువకులు స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఎస్పీ భూపాల్ స్టేషన్ వద్దకు బయలుదేరారు. ఆయన స్టేషన్‌కు కొంతదూరంలో ఉండగానే పెద్దసంఖ్యలో యువకులు ఎదురెళ్లి దాడికి యత్నించారు. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే ఎస్పీ గన్‌మన్ వాహనంలో నుంచి దిగి ఫైరింగ్ ఓపెన్ చేశారు. గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఎస్పీ అక్కడి నుంచి వెనుదిరిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టేషన్ వద్దకు చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులపైనా కొందరు యువకులకు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ సుమారు ఐదారు వందల మంది యువకులు స్టేషన్ ఆవరణలోనే నిరసన కొనసాగించారు. స్టేషన్‌పైకి చెప్పులు, రాళ్లు విసిరారు. -
వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు రక్షణ కల్పించండి
నెల్లూరు ఎస్పీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా జెడ్పీటీసీ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు శుక్రవారం జిల్లా పోలీసులను ఆదేశించింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఎన్నిక పూర్తయ్యేంత వరకు వారి రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీకి హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులపై ఏవైనా కేసులు ఉంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని... ఎన్నిక పూర్తయిన తరువాత చట్ట ప్రకారం తగిన చర్యలకు ఉపక్రమించవచ్చునని పోలీసులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు.