
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవయాని
గూడూరు: కన్న కూతురు ప్రియుడితో ఉండడాన్ని చూసిన తండ్రి సహనం కోల్పోయి, కత్తితో దాడి చేయగా అడ్డుగా వచ్చిన కుమార్తె గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ హుస్సేన్‌బాషా తెలిపిన మేరకు.. నరశింగరావుపేటలో కూకటి సిద్ధయ్య కుటుంబం నివాసముంటోంది. సిద్ధయ్య గొర్రెల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమార్తె దేవయాని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన జావీద్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. దేవయాని, జావీద్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దేవయాని తండ్రి సిద్ధయ్య ప్రతి శుక్రవారం సంతకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేసి, వాటిని చెన్నైకి తీసుకెళ్లి విక్రయిస్తూ వస్తుంటాడు.
శుక్రవారం తెల్లవారుజామునే సిద్ధయ్య చిల్లకూరులో జరిగే సంతకు వెళ్లాడు. తల్లి లక్ష్మి బయటకు వెళ్లింది. దీంతో దేవయాని తన ప్రియుడు జావీద్‌ను ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. జావీద్ సిద్ధయ్య ఇంటికి వచ్చాడు. సంతకు వెళ్లిన సిద్ధయ్య గొర్రెలు కొనుగోలు చేసేందుకు ధరలు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి తలుపు తట్టగా, భయాందోళనకు గురైన దేవయాని, జావీద్‌ను దేవునిమూల చాటుగా దాచి తలుపు తీసింది. సిద్ధయ్య ఇంట్లోకి వచ్చి నగదును బీరువాలో ఉంచేందుకు దేవుని గదిలోకిరాగా, అక్కడ నక్కి ఉన్న జావీద్‌ను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. చాకుతో జావీద్‌పై దాడి చేయబోగా దేవయాని అడ్డుగా వచ్చింది. ఆమె తలకు గాయమైంది. పొరుగువారు గాయపడిన దేవయానిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ హుస్సేన్‌బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment