రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కట్టెలు
నెల్లూరు , ఆత్మకూరు/మర్రిపాడు: మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఘోర రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబసభ్యుల్లో తీవ్ర నిషాదాన్ని నింపింది. అతివేగం కారణంగా మూడు నిండు ప్రాణాలు బలికావడంతోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి మర్రిపాడు మండలంలోని నందవరం సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఉన్నారు. ఇంటి యజమాని సయ్యద్ వశీ అహ్మద్, అతని మరో ఇద్దరు కుమార్తెలు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన సయ్యద్ వశీ అహ్మద్ 15 సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రమైన నెల్లూరుకు ఉపాధి కోసం వచ్చాడు. కర్నూలుకు చెందిన షాజీయా పర్వీన్ (40)ను వివాహం చేసుకున్న ఇతను నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఓ స్కూల్ పక్కనే నివాసం ఉంటున్నాడు.
ఆటోనగర్‌లో హోస్‌పైపుల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్న అహ్మద్‌కు సౌమ్యుడిగా పేరుంది. తన వ్యాపారం, తన కుటుంబం అన్నట్లుగా ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె తుహారా బేగం డిగ్రీ, మరో కుమార్తె ఉమైనా బేగం (18) ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె మొబీనా చదువుతున్నారు. ఇటీవల కళాశాలకు వరుసగా సెలవులు రావడంతో అహ్మద్ కుటుంబంతో సహా కారులో అత్త వారి ఊరైన కర్నూలుకు వెళ్లాడు. సెలవులు ముగుస్తుండడంతో గురువారం నెల్లూరుకు కారులో గురువారం బయలుదేరారు. ఈ క్రమంలో నందవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అహ్మద్ భార్య షాజియా పర్వీన్ కుమార్తె ఉమైనా బేగంలను కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గాంధీనగర్‌లోని వశీ అహ్మద్ ఇంటి సమీపంలోని వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ కుటుంబానికి ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పనిచేసే చోటుకు వెళుతూ..
చేజర్ల మండలం కోటితీర్థంకు చెందిన పెంచలమ్మ, కుమారుడు నాగేంద్ర జీవనం కోసం బద్వేల్‌లో సిమెంట్ ఒరలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన వారు తిరిగి పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బద్వేల్‌కు వెళుతున్న కారులో ఎక్కారు. వారితోపాటు జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన రామానాయుడు (55) బద్వేల్‌కు వెళ్లేందుకు అదే కారులో ప్రయాణం చేస్తున్నాడు. నందవరం వద్ద ట్రాక్టర్‌ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొంది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రామానాయుడు ఆస్పత్రిలో చికిత్స అందించేలోగా మృతిచెందాడు.
బీపీ ఎక్కువై..
తల్లి పెంచలమ్మ, తమ్ముడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సుబ్బారాయుడు వారిని చూసేందుకు ఆత్మకూరులోని ఆస్పత్రికి వచ్చాడు. వారిద్దరిని చూసి బీపీ ఎక్కువ కావడంతో ఆస్పత్రి వెలుపల మెట్లపై బోర్లా పడిపోయాడు. దీంతో అతని దంతాలు ఊడిపోవడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment