ప్రాణాలు తీసిన వేగం | Jharkhand Family Died in Car Accident Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన వేగం

Published Wed, Nov 14 2018 10:16 AM | Last Updated on Tue, Nov 20 2018 12:45 PM

Jharkhand Family Died in Car Accident Hyderabad - Sakshi

ధ్వంసమైన వాహనం ఘటనా స్థలంలో మృతదేహాలు తల్లి ఒడిలో విగత జీవిగా రుద్రాన్స్‌

కీసర: కీసర రింగ్‌రోడ్డుపై రాంపల్లిదాయర వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు రెండు నెలల పసి కందు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు చెందిన దినేష్‌కుమార్‌ కుటుంబంతో గత కొన్నేళ్లుగా ఫీర్జాదిగూడ బుద్దనగర్‌లో ఉంటూ, ఉప్పల్‌ అపోలో క్లీనిక్‌లో సెంట్రల్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు .   నెలరోజుల క్రితం ఉద్యోగాన్ని మానివేసిన అతను ఇటీవల రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌ కేశవనగర్‌కు మకాం మార్చాడు.  దినేష్‌కుమార్‌ బావమరిది రిషికేష్‌ నారపల్లిలోని నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతూ సమీపంలోని సింగపూర్‌టౌన్‌షిప్‌లో ఉంటున్నాడు. 

మంగళవారం రిషికేష్‌ను కలిసి కాలేజీ ఫీజు చెల్లించేందుకు దినేష్‌కుమార్‌ ఆల్టోకారులో  భార్య సాగరిక, కుమారుడు రుద్రాన్స్‌తో ఓఆర్‌ఆర్‌ మీదుగా  ఘట్‌కేసర్‌ బయలుదేరాడు. ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద కిందకు దిగాల్సి ఉండగా ముందుకు వెళ్లాడు. తాను దిగాల్సిన చోటు దాటిపోయిందన్న కంగారులో వేగంగా కారును నడుపుకుంటూ  రాంపల్లి దాయర సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై ఉన్న వంతెనగోడను ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో దినేష్‌కుమార్, ఆయన భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో కీసర సీఐ ప్రకాష్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని, మృత దేహాలను కారులోనుంచి బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి రుద్రాన్స్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో  తల్లి ఒడిలోనే ప్రాణాలొదిలాడు. సంఘటన స్థలాన్ని డీసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఏసీపీ శివప్రసాద్, ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరిరెడ్డి సందర్శించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 170 కిలోమీటర్ల స్పీడ్‌లో పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement