సంధ్య మృతదేహం
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి భార్యను హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ ఘటన నెల్లూరులోని ప్రశాంతి నగర్‌లో చోటుచేసుకుంది. నవాబుపేట ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళంకు చెందిన గౌరీశ్వరి, తౌడు దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, సంధ్య (20) కుమార్తె. అందరూ 18 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. సౌత్‌రాజుపాళెంలోని ఓ రైస్‌మిల్లులో పనిచేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. అదే మిల్లులో కోడూరుపాడుకు చెందిన మహేష్ మెషిన్ ఆపరేటర్‌గా చేరాడు. అతనికి సంధ్యతో పరిచయమైంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2016 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రశాంతి నగర్‌లో కాపురం ఉంటున్నారు. వారికి పదినెలల కొడుకు ఉన్నాడు. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అనంతరం మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. మహేష్ వివాహానికి ముందు ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని తెలుసుకున్న సంధ్య అతడిని నిలదీసింది. దీంతో వారి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి.
తీవ్ర ఘర్షణ
కొద్దిరోజులుగా దంపతులిద్దరూ ఘర్షణ పడుతుండటంతో ఇరువురి పెద్దలు వారికి సర్దిచెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల నడుమ తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ ఆమెపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఖంగుతిన్న అతను సంధ్యది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకున్నట్లు చేసి చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారి సమక్షంలో భార్యను చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్ సోమవారం మృతదేహాన్ని పరిశీలించారు. తన సోదరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి అన్న అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు సైతం ఆమెది ఆత్మహత్య కాదని పేర్కొనడంతో హత్య కేసుగా నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వెల్లడించారు. తహసీల్దార్ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. మంగళవారం మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహిస్తారని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment