ప్రాణాలు తీసిన సిమెంట్‌ ట్యాంకర్‌ | Two Men Died Road Accident Chittoor | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన సిమెంట్‌ ట్యాంకర్‌

Published Sat, Jul 6 2019 9:48 AM | Last Updated on Sat, Jul 6 2019 9:49 AM

Two Men Died Road Accident Chittoor - Sakshi

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం(నెల్లూరు) : వారంతా వ్యవసాయ కూలీలు. అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరారు. గడ్డిని ట్రాక్టర్లలో నింపి సూర్యోదయం నాటికి చేరుకుంటారు. వాములుగా వేసి సూర్యుడు నడినెత్తికెక్కేసరికి ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ వారి జీవితంలోకి సిమెంట్‌ ట్యాంకర్‌ మృత్యువులా వచ్చింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ట్యాంకర్‌ వెనుకనుంచి ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కూలీలందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ముగ్గురికి స్వల్పగాయాలు కాగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికిని నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం 108 వాహనాల్లో సిబ్బంది హుటాహుటిన తరలించారు.

అందులో ఓ వ్యక్తి వెంటనే మృతిచెందగా, మరో మహిళ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ వైద్యం అందక మృతిచెందింది. మిగిలిన నలుగురిలో ముగ్గురిని నెల్లూరులోని డీఎస్సార్‌ ఆస్పత్రికి 108లో తరలించగా, నలుగురిని బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అందించి నలుగురిని కూడా వైద్యులు లేకపోవడంతో నెల్లూరుకే సిఫార్సు చేశారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళెం పంచాయతీ పల్లాప్రోలుకు చెందిన జమ్మలమడుగు లచ్చయ్య వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సాల్మాన్‌పురానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి ట్రాక్టర్‌లో పంచేడుకు వెళ్లి గడ్డి తేవాలని అనుకున్నారు.

ఈక్రమంలో అర్ధరాత్రి ఒంటిగంటకు ట్రాక్టర్‌ను మల్లికార్జున్‌రెడ్డి పల్లాప్రోలుకు తీసుకెళ్లాడు. అక్కడ పోలినాయుడు చెరువు గిరిజనకాలనీకి చెందిన తిరంశెట్టి వెంకటలక్ష్మమ్మ, మారుబోయిన వెంకటరమణమ్మ, కల్లూరు సునీల్, బండి వెంకటేశ్వర్లు, పల్లాప్రోలుకు చెందిన జమ్మలమడుగు శారద, వడ్డి రామయ్య, తురకా సుమతి, పెనుమాల అన్నమ్మ, తురకా వెంకటలక్ష్మిలను తీసుకుని బుచ్చిరెడ్డిపాళేనికి బయలుదేరారు. రాఘవరెడ్డి కాలనీ వద్ద మరో మహిళా కూలీ తలారి మంజులను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌ను ముంబై జాతీయ రహదారిపై పక్కన ఆపారు. అందరూ టీ తాగారు. మంజుల వచ్చి ట్రాక్టర్‌ ఎక్కింది. బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో నెల్లూరు నుంచి సంగం వైపు వెళుతున్న సిమెంట్‌ ట్యాంకర్‌  వెనుక నుంచి వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో డ్రైవర్‌ మల్లికార్జున్‌రెడ్డితోపాటు ట్రాక్టర్‌లో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. విషయాన్ని స్థానికులు 108కు సమాచారం అందించారు. 

వైద్యసేవలందక..
సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం, సంగం, నెల్లూరు నుంచి మూడు 108 వాహనాలు సంఘటనా స్థలానికి వచ్చాయి. అందులో బుచ్చిరెడ్డిపాళెం వాహనంలో బండి వెంకటేశ్వర్లు, తురకా సుమతి, సానిగుంట మస్తానమ్మ, జమ్మలమడుగు శారద, వడ్డి రామయ్య, తలారి మంజులను బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తిరంశెట్టి వెంకటలక్ష్మమ్మ, కల్లూరు సునీల్, మారుబోయిన వెంకటరమణమ్మను సంగం 108 వాహనంలో నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో ఆస్పత్రికి వచ్చిన రెండు నిమిషాల్లో వడ్డి రామయ్య (53) మృతిచెందాడు. తలారి మంజుల (45) 20 నిమిషాలపాటు కొనఊపిరితో ఉండి వైద్యసేవలందక మృతిచెందింది. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ చిరంజీవి రాలేదని అందుకు ఇద్దరూ మృతిచెందారని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా మంజూల స్వగ్రామం దగదర్తి మండలం శ్రీరామపురం కాగా బుచ్చిరెడ్డిపాళెంలోని బంధువుల వద్ద ఉంటోంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

వైద్యం చేసిన స్టాఫ్‌ నర్స్‌
డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో రాత్రి విధుల్లో ఉన్న స్టాఫ్‌ నర్స్‌ సృజన అంతా తానై చేయాల్సి వచ్చింది. కొంత సమయం తర్వాత మరో స్టాఫ్‌ నర్స్‌ ఇందిరావతి సహాయంగా వచ్చింది. నలుగురు క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యసేవలందించి నెల్లూరు డీఎస్సార్‌ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 

108 సిబ్బంది స్పందన
ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తీసుకురావడం, ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తీసుకెళ్లడంతో 108 సిబ్బంది చూపిన శ్రద్ధపై ప్రజలు అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులు ఎవరూ లేకున్నా బుచ్చిరెడ్డిపాళెం ఈఎన్టీ శ్యామ్‌కుమార్, పైలెట్‌ దిలీప్, సంగం వాహనం ఈఎన్టీ రమేష్, పైలెట్‌ నాగరాజు, నెల్లూరు వాహనం ఈఎన్టీ సురేంద్ర, పైలెట్‌ అబూబకర్‌కు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 

వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యుల మండిపాటు
ఆస్పత్రిలో రాత్రి పూట ఉండాల్సిన డాక్టర్‌ లేని కారణంగా వడ్డిరామయ్య, తలారి మంజుల మృతిచెందారని కుటుంబసభ్యులు ఆరోపించారు. స్టాఫ్‌ నర్సు మొత్తం చేయాల్సి వచ్చిందని చెప్పారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

ప్రసన్నకుమార్‌రెడ్డి సంతాపం
ఇస్కపాళెం పంచాయతీ పల్లాప్రోలు, పోలినాయుడు చెరువు గ్రామస్తులు ప్రమాదానికి గురయ్యారని తెలిసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కోడూరు మధుసూదన్‌రెడ్డితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. 

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement