సాక్షి, నెల్లూరు : మహిళా కానిస్టేబుల్‌ను వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న ఓ విశ్రాంత ఉద్యోగిపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్‌లో ఓ యువతి నివాసం ఉంటోంది. ఆమె నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రసన్నమాల ఆమె వెంటపడుతూ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పలుమార్లు సదరు యువతి అతనిని తీవ్రస్థాయిలో మందలించినా మార్పురాలేదు.
ఇటీవలే ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఈ నెల 2వ తేదీ రాత్రి సదరు మహిళా కానిస్టేబుల్ స్టేషన్‌లో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెను వెంబడిస్తూ క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేసరికి ఫోన్‌నంబర్ ఇవ్వాలని ఆమెను చేయిపట్టుకునేందుకు యత్నించాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకుని వెళుతుండగా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఓ ఉద్యోగి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతరం విశ్రాంత ఉద్యోగిని మందలించి అక్కడి నుంచి పంపివేశాడు. బుధవారం సదరు విశ్రాంత ఉద్యోగి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి వెళ్లి అక్కడున్న ఉద్యోగులకు సదరు మహిళా కానిస్టేబుల్‌కు డబ్బులు ఇచ్చానని, తనను పెళ్లిచేసుకోమన్నదని ఇలా అనేక రకాల ఆరోపణలు చేశాడు.
ఈ విషయంపై పలువురు ఉద్యోగులు మాట్లాడుతుండగా విన్న మహిళా కానిస్టేబుల్ మనస్థాపానికి గురై చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఆరోపణలు చేయడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్న విశ్రాంత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశ్రాంత ఉద్యోగిపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment