చెరువులో ఈత కొడుతున్న పెద్దలు, యువకులు
సాక్షి, నెల్లూరు : చిన్నారులు, యువత ఈత సరదా పలువురి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈత రాకపోవడం, ప్రమాదకర ప్రదేశాల హెచ్చరికలు లేకపోవడంతో స్నేహితులతో కలిసి నీటి వనరుల వద్దకు వెళ్లే పిల్లలు, యువకులు ప్రమాదాలను అంచనా వేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఎండల వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు, యువకులు సరదాగా జల వనరుల్లో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. మైపాడు, కొత్తకోడూరు, తూపిలిపాళెం సముద్ర తీరంలో జలకాలు ఆడుతూ అలల్లో కొట్టుకుపోయి ఇటీవల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గూడూరు మండలంలో ఇటీవల మైన్ గుంతలో ఈతకు దిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సోమశిల జలాశయంలో ఇద్దరు బాలికలు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.
ప్రమాదాలకు కారణాలు ఇవే
జిల్లాలోని చెరువుల్లో మట్టి కోసం అక్రమంగా పెద్ద పెద్ద గుంతలు తవ్వ వదిలేసి ఉన్నారు. ఈ గుంతలు నీటితో ప్రమాదభరితంగా ఉన్నాయి. చిన్నారులు సెలవు రోజుల్లో జలాశయాలు, సముద్రతీరాలు, పెద్ద పెద్ద కాలువల్లో స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. గుంతలు లోతుగా బురదతో నిండి ఉండడం, సముద్ర తీరంలో అలల తాకిడి, జలాశయాల్లో ఊబిల్లో కూరుకుపోయి మృత్యువు పాలవుతున్నారు. ఈత రాని పిల్లలు కాలువలు, చెరువుల్లోకి వెళ్తే మునిగిపోతారు. చిన్నారుల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
⇒ జిల్లాలో వ్యవసాయ బావులు, నీటి పారుదల కాలువలు, చెరువులు ఉన్నాయి. కాలువల్లో నీరు ఎప్పుడూ ప్రవహిస్తుండడం వల్ల అంచుల్లో, అడుగుభాగాన నాచు పేరుకుని ఉంటుంది. దీంతో ప్రమాదవశాత్తు కాలువల్లో జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగి పోయే అవకాశం ఉంది.
⇒ ఈత రాకపోవడం ప్రమాదాలకు మరో ముఖ్య కారణం. జలవనరుల అడుగు భాగంలో పూడిక ఉండడంతో పాటు నాచు, గుర్రపుడెక్క చెట్ల తీగలు అల్లుకుపోయి ఉంటాయి. వీటిని అంచనా వేయకుండా ఏమరపాటుగా లోనికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకుని జల సమాధి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
⇒ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, బావుల్లోకి ఈతకు వెళ్తారు. సరదా కోసం ఎత్తులో నుంచి బావిలో దూకినప్పుడు లోతుకు వెళ్లి మట్టిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
⇒ నీటి లోతు తెలుసుకోకుండా జలాశయాలు, ప్రధాన కాలువలు, సముద్రాల్లోకి దిగడంతో మునిగిపోయే ప్రమాదం ఉంది. నీటి లోతు కారణంగా మృతదేహాల కోసం రోజుల తరబడి నిరీక్షించాచాల్సి రావడం విషాదం జరిగిన కుటుంబాల్లో తీరని వేదన నింపుతోంది. ఉజ్వల భవిష్యత్ ఉన్న యువకులు ప్రమాదాలు అంచనా వేయకపోవడం, అజాగ్రత్తతో కన్న వారికి పుట్టెడు శోకాన్ని మిగుల్చుతున్నారు.
ప్రమాదాలను ఇలా నివారించవచ్చు
⇒ ఈత నేర్చుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి
⇒ జలాశయాల్లోకి దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి.
⇒ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దూకడం, ఈత కొట్టడం చేయొద్దు. పూర్తిగా ఈత వచ్చే వరకు లోతైన ప్రాంతానికి పోకూడదు.
⇒ నేర్చుకునే సమయంలో ట్యూబులు, బెండ్లు వాడుతున్నప్పటికీ శిక్షకులు లేకుండా జలవనరుల్లోకి దిగడం మంచిది కాదు..
⇒ ఈత నేర్చుకోవాలనుకునే ఉత్సాహం ఉన్న పిల్లల ను సెలవు రోజుల్లో పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
⇒ నీటి ప్రవాహాలు బావులు, చెరువులు ఉన్న చోట పంచాయతీల పాలకులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
⇒ ఈత రాకున్నా స్నేహితులు బలవంతం చేస్తున్నారని జలాశయాల్లోకి దిగే సాహసం చేయొద్దు
⇒ మైపాడు, కొత్తకోడూరు, తూపిలిపాళెం బీచ్‌ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచికలు దాటి వెళ్లే ప్రయత్నం చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment