అసాంఘిక శక్తులుదొంగతనాలు, సుపారీ హత్యలు,
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, సుపారీ హత్యలు, రౌడీ దందాలు పెరగడంతో జిల్లాలో క్రమేపీ శాంతిభద్రతలు క్షీణదశకు చేరుతున్నాయి. అక్రమరవాణా జోరుగా సాగుతోంది. పోలీసుశాఖను సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో పనిఒత్తిడి పెరిగి సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది కుమ్మకై బాధితులను నిలువు దోపిడీకి గురిచేస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఇలా పలు సమస్యలు నూతన ఎస్పీ ఐశ్వర్య రస్తోగికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సమస్యల పరిష్కారానికి నూతన ఎస్పీ ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి.
సిబ్బంది ఇష్టారాజ్యం
జిల్లాలో 22 స్కరిళ్లు, 64 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 2 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. పలు పోలీసుస్టేషన్‌లలో పాలన అస్థవ్యస్థంగా మారింది. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం స్టేషన్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. అంగ, ఆర్థిక బలం ఉంటేనే పనులు జరుగుతున్నాయి. స్టేషన్‌లలో రైటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిందే వేదంగా మారడంతో బాధితులు ముందుగా వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పోలీసు పాలనలో ఖద్దరు జోక్యం మితిమీరింది. కొన్ని పోలీస్‌స్టేషన్‌లను నేతలు అడ్డాగా చేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు. వచ్చిన మొత్తంలో అధికారులు, నేతలు పంచుకొంటున్నారు. ఈ క్రమంలో న్యాయం కోసం జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌డేలో పోలీసు ఉన్నతాధికారులకు తమగోడును వినిపించి కన్నీటిì పర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ పలువురు అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. నూతన ఎస్పీ అయినా ఖద్దరు జోక్యాన్ని, అవినీతిని నిర్మూలించి బాధితుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే çపరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
క్షీణిస్తున్న శాంతిభద్రతలు
జిల్లాలో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నారు. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు నిత్యకృత్యంగా మారాయి. అంతర్‌రాష్ట్ర నేరగాళ్లు జిల్లాలో పాగావేసి అందినకాడికి దోచుకెళుతున్నారు. మహిళలకు ఇంటా, బయటా భద్రత కొరవడింది. లైంగికదాడులు పెరిగాయి. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దుండగులు ఆభరాణాలను తెంపుకెళుతున్నారు. కిరాయి సంస్కృతి జిల్లాలో ఇటీవల కాలంలో అధికమైంది. çనిందితులు సుపారీ తీసుకుని ఎదుటి వారి ప్రాణాలను నిలువునా తీసేస్తున్నారు. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన శాంతిభద్రతలను అందించేందుకు ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దొంగతనాలు, దోపిడీలను నియంత్రించేందుకు సీసీఎస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
ఆగని అక్రమరవాణా
జిల్లాలో ఎర్రచందనం, ఇసుక, సిలికా, గుట్కా, గంజాయి, రేషన్‌బియ్యం, నిత్యావసరాల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. గత ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ అక్రమరవాణా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో కొంతమేర వాటికి ఫుల్‌స్టాప్ పడింది. కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో ఇసుక, సిలికా, గుట్కా అక్రమరవాణా జోరుగా సాగుతోంది. మామూళ్ల కోసం కొందరు పోలీసు సిబ్బంది అక్రమ వ్యాపారులను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జడలు విపుతున్న బెట్టింగ్
బెట్టింగ్, సింగల్ నంబర్లాట, జూదం తిరిగి ఊపందుకొంటోంది. గత ఎస్పీ బెట్టింగ్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. దీంతో పూర్తిస్థాయిలో బెట్టింగ్‌కు బ్రేక్‌పడింది. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందిపై సైతం వేటు వేశారు. ఇటీవల పోలీసు నజర్ లేకపోవడంతో తిరిగి బెట్టింగ్ ఊపందుకొంటోంది. రహస్యంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ అస్తవ్యస్తం
నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడపడితే అక్కడ నిలిపే బస్సులు, నడిరోడ్లపైనే ఆటోస్టాండ్లు, పార్కింగ్‌లు, వ్యాపారాలు వెరసి నగరవాసులకు ట్రాఫిక్ టెర్రిఫిక్‌గా మారింది. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పని ఒత్తిడి
సిబ్బంది కొరత పోలీసుశాఖను వెంటాడుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. ఉన్న సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగి పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. సిబ్బంది కొరత సమస్యను తీర్చి పనిఒత్తిడి తగ్గించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment