ఖరీదైన కార్లలో ఎర్రబంగారం స్మగ్లింగ్‌ | Sandle Wood Smuggling In Costly Cars PSR Nellore | Sakshi
Sakshi News home page

ఖరీదైన కార్లలో ఎర్రబంగారం స్మగ్లింగ్‌

Published Fri, Aug 31 2018 1:08 PM | Last Updated on Fri, Aug 31 2018 1:08 PM

Sandle Wood Smuggling In Costly Cars PSR Nellore - Sakshi

హైవే మొబైల్‌ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు, వాహనం

విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్న ఎర్రచందనం సంపదను అక్రమార్కులు కొల్లగొడుతూనే ఉన్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. నిఘా అధికారుల కళ్లుగప్పుతూ పొరుగు రాష్ట్రం తమిళనాడు మీదుగా ఎర్రబంగారాన్ని విదేశాలకు తరలించేస్తున్నారు. ఖరీదైన కార్లు, వాహనాలను వినియోగిస్తూ ఎలాంటి అనుమానం రాకుండా స్మగ్లింగ్‌ చేసేస్తున్నారు. సీట్లను తొలగించి అందులో ఎర్రచందనం దుంగల్ని రవాణా చేస్తున్నారు. గురువారం సూళ్లూరుపేటలో పట్టుబడిన ఎర్రచందనం వాహనమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. అంతేకాదు వాహనాలకు  ఎమ్మెల్యే స్టిక్కర్లు వినియోగించి అధికారులను బురిడీ కొట్టించడం గమనార్హం. అధికారులు కూడా మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.

నెల్లూరు, సూళ్లూరుపేట:  రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని అటవీప్రాంతాల్లో అపారమైన ఎర్రచందనం సంపద ఉంది. ఎంతో విలువైన ఎర్రబంగారం పొరుగు రాష్ట్రం తమిళనాడు మీదుగా విదేశాలకు తరలిపోతోంది. ఈ అక్రమ రవాణాతో అటు స్మగ్లర్లు, ఇటు అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. దొరికితేనే దొంగలు.. లేదంటే దొరలు అన్నట్టుగా తయారైంది. జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతాల్లోనే కాకుండా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒకచోట ఎర్రచందనం తరలించే వాహనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ అక్రమ రవాణాకు మినీలారీలు, పార్శిల్‌ లారీలు, ఖరీదైన కా>ర్లను ఉపయోగిస్తున్నారు. ఖరీదైన అధునాతన వాహనాల్లో సీట్లను తొలగించి ఎర్రచందనం దుంగల్ని ఉంచుతున్నారు. అంతేకాదు ఏదో రాజకీయ నాయకుడి(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) స్టిక్కర్లు చేసుకుని దర్జాగా రవాణా చేస్తున్నారు. దుండగులను పట్టుకోవడంలో అధికారులు ప్రతిసారీ ఘోరంగా విఫలమవుతూనే ఉన్నారు. ఎర్రచందనం వాహనంతో వ్యక్తులు పట్టుబడినా రాజకీయ నాయకుల ఫోన్ల వల్ల, ఈ వ్యాపారం చేసే వారు ఇచ్చే తాయిలాల వల్ల పట్టుబడిన వ్యక్తులను గుట్టుచప్పుడు కాకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. విధి లేని పరిస్థితిలో ఎర్రచందనం తరలించే వాహనాలు పట్టుబడితే దుండగులు పరారయ్యారని, పట్టుబడిన దుంగలు, వాహనంపై కేసు నమోదు చేసేసి అటవీశాఖకు బదలాయించి పోలీసులు చేతులు దులిపేసుకుంటున్నారు.

వివరాలు తెలిసినా..
ఏవాహనంలో ఎర్రచందనం రవాణా అవుతుందో పోలీసులకు, చెక్‌పోస్టులోని అటవీ శాఖాధికారులకు తెలుసుననే విషయం బహిరంగ రహస్యమే. జిల్లాలోని వెలిగొండ అటవీప్రాంతంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో, తిరుమల–తిరుపతి కొండల్లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా ఎర్రచందనం విస్తరించి ఉందని అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. గత పదేళ్లలో అధికారులు జరిపిన దాడుల్లో వేల టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసున్నారు. ఇందులో 1000 మందికి పైగా అరెస్ట్‌ చేసి వందలాది వాహనాలు సీజ్‌ చేశారు. ఈ అక్రమ రవాణాలో పట్టుబడిన వారంతా ఎర్రచందనాన్ని నరికే కూలీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అక్రమ రవాణా చేసే అసలు సిసలైన బడా వ్యక్తులు మాత్రం పట్టుబడరు. చిత్తూరు జిల్లా కేంద్రంగా నెల్లూరు జిల్లా మీదుగా భారీ ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కడప, రాజంపేట, తిరుపతి పట్టణాల్లో ఎర్రచందనాన్ని నరికే కూలీలను భారీ ఎత్తున అరెస్ట్‌ చేసినప్పటికీ రవాణా ఆగలేదంటే పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి, కడప జిల్లా వైపు నిఘా ఎక్కువ కావడంతో కూలీలు కర్నాటక మీదుగా రూటు మారి రావడమే కాకుండా ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్‌ జరుగుతోంది. ఈ ఏడాది జూన్‌ 20వ తేదీన ఫారెస్టు బీటు అధికారితోపాటు 16 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. సుమారు రూ.2.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని తడలో 2003లో పోలీసుల సాయంతో తమిళనాడు గుమ్మిడిపూండికి చెందిన ఓ స్మగ్లర్‌ జాతీయ రహదారికి పక్కనే మూతపడిన ఓ కంపెనీని లీజుకు తీసుకుని ఏకంగా ఇక్కడ సామిల్లు పెట్టేశాడు. ఈ సామిల్లులోనే ఎర్రచందనాన్ని కటింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో జిల్లా పోలీస్‌ అధికారులకు స్థానికులు అందించిన సమాచారం మేరకు దాడులు చేసి సుమారు రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని ఈ సామిల్లులో పట్టుకున్నారు.

కేసులు.. అరెస్టులు
జిల్లావ్యాప్తంగా ఏడాది కాలంలో సుమారు 66 కేసులు వరకూ నమోదు చేసి 393 మందిని అరెస్టు చేశారు. ఎనిమిది మందిపై పీడీ కేసులు కూడా నమోదయ్యాయి. 2000 టన్నుల బరువైన 1310 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుంది. 83 వాహనాలను సీజ్‌ చేశారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సూళ్లూరుపేట: వెలిగొండ అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలివెళుతున్న సుమారు రూ.3 లక్షలు విలువైన ఐదు ఎర్రచందనం దుంగలను సూళ్లూరుపేట పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైవే మొబైల్‌ పోలీసులు హోలీక్రాస్‌ సెంటర్‌ వద్ద గురువారం తెల్లవారుజామున గస్తీలో ఉన్నారు. టీఎన్‌ 05 ఏజడ్‌ 4133 నంబర్‌ కలిగిన అశోక్‌ లేలాండ్‌ స్టైల్‌ అనే కారుపై అనుమానంతో వెంబడించారు. ఈ విషయాన్ని గుర్తించిన కారు డ్రైవర్, మరో వ్యక్తి చెంగాళమ్మ పరమేశ్వరి దక్షిణంవైపు స్వాగత ద్వారం వద్ద వాహనాన్ని నిలిపి పరారయ్యారు. పోలీసులు తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. దీంతో ఎస్సైకి సమాచారం అందించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని టాస్క్‌పోర్స్‌ అధికారులకు అప్పగించామని ఎస్సై తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement