నర్మద (ఫైల్) ,ప్రభుత్వ వైద్యశాల వద్ద గ్రామస్తులు
నెల్లూరు, నాయుడుపేటటౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న యువతి కుటుంబసభ్యులకు భారం కాకూడదనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పినట్లు సూళ్లూరుపేట రైల్వే ఎస్సై కిష్టయ్య బుధవారం వెల్లడించారు. నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం సంఘమిత్ర రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువతి ఆచూకి లభ్యమైంది. మండల పరిధిలోని మర్లపల్లి గ్రామానికి చెందిన ఏలూరు నర్మద (20)గా రైల్వే పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన నర్మద శ్రీసిటీలోని సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె తల్లి సంపూర్మ కూడా మేనకూరు సెజ్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
గతంలో సంపూర్ణ భర్త రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నర్మద ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందింది. అయితే తన అనారోగ్యంతో కుటుంబసభ్యులు అవస్థలు పడకూడదని ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యకు పూనుకున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. యువతి మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి వారికి అప్పగించారు. గ్రామస్తులు అనేకమంది వైద్యశాల వద్దకు చేరుకుని కంటతడి పెట్టారు. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment