nayudupeta
-
మీ బిడ్డ ను ఓడించాలని దండుపాళ్యం ముఠా బయలుదేరింది
-
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నాయుడుపేట టౌన్: నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్వే వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన త్రినాథ్ (22), సాయి (25) అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ప్రవల్లిక అనే తొమ్మిదేళ్ల బాలిక స్వర్ణముఖి నదిలో గల్లంతైంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. నాయుడుపేట సమీపంలోని మేనకూరు ప్రైవేటు పరిశ్రమలో పనిముగించుకుని త్రినాథ్, సాయి, దొరవారిసత్రం మండలం మోదుగులపాళెంకు చెందిన నాగూర్ ఒకే బైక్‌పై నాయుడుపేటకు వస్తున్నారు. వీరి వెనుకే బైక్‌పై తుమ్మూరులో నివాసముంటున్న మురళి, ఆయన భార్య సుజాత, కుమార్తె ప్రవల్లిక వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు కాజ్‌వేపై వెళ్తుండగా ముగ్గురు యువకులు తమ బైక్‌తో దాన్ని ఢీకొట్టారు. దీంతో వెనుకనే మరో బైక్‌పై వస్తున్న మురళి దంపతులతోపాటు వారి కుమార్తె ప్రవల్లిక స్వర్ణముఖి నదిలో పడిపోయారు. గాఢాంధకారంలో గాయాలతో ఉన్న మురళి, సుజాతలు వెంటనే కాజ్వే పైకి వచ్చి తమ బిడ్డ నదిలో కొట్టుకుపోతోందని పెద్ద ఎత్తున కేకలు వేశారు. ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పటికే త్రినాథ్, సాయి మృతి చెందారు. నాగూర్ గాయాలతో బయటపడ్డాడు. బాలిక కోసం గాలింపు: ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు డి.వెంకటేశ్వరరావు, బాలకృష్ణయ్యలు పోలీసు సిబ్బందితో హుటాహుటిన కాజ్వే వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్థానికులు స్వర్ణముఖి నదిలో దిగి గల్లంతైన ప్రవల్లిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా హుటాహుటిన నది వద్దకు చేరుకొని ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బాలిక కోసం గాలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి
జైపూర్ : రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని 10 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికుల సహాయంతో అస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాహనాల అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు: నాయుడుపేట స్వర్ణముఖి వంతెనపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో చిన్నారి నదిలో పడి గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సైతం సహాయ చర్యల్లో పాల్లొంది. మృతులు విశాఖకు చెందిన సాయి, త్రినాథ్‌లుగా గుర్తించారు. మేనకూరు లోని గ్రీన్ టెక్ పరిశ్రమలో ఉద్యోగులుగా తెలుసింది. -
చిగురుటాకులా.. నూరేళ్ల ఆయుష్షు
ఆడే పాడే వయస్సు.. చలాకీగా గడపాల్సిన ప్రాయం.. బడికిపోదామంటే భయం భయం.. చేయి కదపలేడు.. రాత రాయలేడు.. ఆడుకుందామంటే ఆందోళన.. తనకేమవుతుందోననే భయం.. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే మెడపై ఏర్పడిన గడ్డ (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్)అతన్ని కదలనీయకుండా చేస్తోంది. చేయి కదిలిస్తే నొప్పితో నరకయాతన. ప్రాణం పోయేంత బాధ. చీపురు పుల్ల తగిలినా గిలగిలా కొట్టుకుంటాడు. వైద్యులు మాత్రం ఆపరేషన్ చేసినా ఆయుష్షుకు గ్యారెంటీ లేదంటున్నారు. వైద్యం చేయించలేని నిరుపేద తల్లిదండ్రుల స్తోమత. కంటికి రెప్పలా కాపాడుకోకపోతే తమ బిడ్డ బతకడేమోనన్న మానసిక వేదన. వెరసి పదిహేనేళ్లుగా ఓ గిరిజన విద్యార్థి బతుకు దినదినగండంలా మారింది. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం గిరిజన కాలనీకి చెందిన నాని నరకయాతన చూస్తే ఎవరైనా కన్నీరు పెడతారు. సాక్షి, నాయుడుపేట: నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాళెం పంచాయతీ శ్రీనివాసపురం గిరిజనకాలనీకి చెందిన సత్యేటి వెంకటరమణయ్య – మరియమ్మలకు ముగ్గురు కుమారులు. తొలి సంతానం సత్తేటి నాని. నానికి పురిటి బిడ్డగా ఉన్న సమయంలోనే మెడపై గుండ్రని కణిత ఏర్పడింది. అప్పట్లో వైద్యులు గడ్డను చూసి ఆపరేషన్ చేస్తే బిడ్డకు ప్రమాదమని చెప్పారు. చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. నానిని స్వగ్రామమైన జువ్వలపాళెం ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివించారు. 9వ తరగతిలో చేరేందుకు సమీప పాఠశాలల్లో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నారు. వసతి గృహంలో చేరాలంటే కణితకు చీపురపుల్ల తగిలినా గిలగిలకొట్టుకుంటూ పడిపోతాడు. ఈ అనారోగ్య కారణంతో వసతి గృహాల్లో చేర్చలేక దూరంగా చదివించలేక తల్లిదండ్రులే భారం మోస్తున్నారు. సమీప పాఠశాలలో చదివించుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేలా తమ బిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. సెంటు భూమి లేని ఈ గిరిజన కుటుంబం కార్పొరేట్ వైద్యం అందించలేని పరిస్థితిలో ఉంది. కార్పొరేట్ వైద్యం అందించాలంటే పెద్ద మొత్తంలో నగదు చెల్లించుకోవాల్సి ఉంది. అంత స్తోమత లేని ఈ కుటుంబం ప్రభుత్వ వైద్యశాలల్లో మెడపై ఉన్న కణితను చూపుతూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు 15 ఏళ్లుగా కాలం వెల్లదీస్తూ వచ్చారు. ఈ క్రమంలో 9వ తరగతిలో చేరాలంటే దూర ప్రాంతాల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బిడ్డను అలా చేర్పిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని మదనపడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంటి వద్దనే ఉంచారు. చేయూతనివ్వని గత ప్రభుత్వాలు పదేళ్లుగా ప్రభుత్వాల నుంచి వారు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నారు. మెడపై గడ్డ కారణంగా కుడిచేయి పైకి లేపలేకపోవడంతోపాటు రోజురోజుకూ చేయి సన్నగిల్లుతోంది. దీని కారణంగా మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న ఆ విద్యార్థికి సదరం క్యాంపులో ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే పెన్షన్ కూడా అందడం లేదు. చేయి కదపలేక, పనిచేసుకోలేక, రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థికి వైద్యశాఖ అధికారులు సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడం బాధాకరమని ఆ గిరిజన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులైనా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నాని మెడపై ఉన్న గడ్డ, చేయి కదపలేని పరిస్థితిలో నాని గడ్డ పెరిగే కొద్ది భయమేస్తుంది పురిటి బిడ్డ నుంచే ఉన్న చిన్నపాటి కణిత రోజురోజుకూ పెరుగుతోంది. పెరిగే కొద్ది భయమేస్తోంది. కొంతమంది వైద్యులు ఆపరేషన్ చేస్తే ప్రమాదమని చెబుతున్నారు. మరికొంతమంది వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంతో కణితను తీసి మామూలు మనిషిని చేస్తారని చెబుతున్నారు. ఉన్న ముగ్గురు బిడ్డలను పోషించేందుకే మా జీవితం సరిపోతోంది. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో డబ్బు పెట్టాలంటే మాకు స్థోమత లేదు. ప్రభుత్వ వైద్యులు మాకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు. – సత్తేటి మణెమ్మ, నాని తల్లి చదువుకోవాలని ఉంది నాకు చదువుకోవాలని ఉంది. మంచి చదువులు చదివి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నా. కానీ నా మెడపై పెరుగుతున్న గడ్డ కారణంగా రాత్రి పడుకున్న సమయంలో నొప్పికి అల్లాడిపోతున్నా. పాఠశాలకు వెళ్లిన సమయంలో స్నేహితులతో కలిసి ఆటలాడలేకున్నా. చదువుపై దృష్టి పెట్టాలంటే ఆరోగ్యం సహకరించడం లేదు. – సత్తేటి నాని, విద్యార్థి -
అండగా నిలవాల్సిన అత్తమామలే..
సాక్షి, నెల్లూరు : భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, అండగా నిలవాల్సిన అత్తమామలే ఆస్తి కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట పట్టణానికి చెందిన సాదు హర్ష అనే యువతిని 2016 ఆగస్ట్ నెలలో వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన సాదు చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేశారు. హర్ష, చంద్రశేఖర్‌లు బెంగళూరులో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి నెలలో చంద్రశేఖర్ స్నేహితుడి వివాహం కోసం స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. భర్త మరణించడంతో హర్ష అత్తమామల వద్దే ఉంటోంది. ఈక్రమంలో అండగా ఉండాల్సిన అత్తమామలు తనకు పిల్లల్లేరని, భర్త ఆస్తి తమకే చెందుతుందని చెప్పారని హర్ష ఫిర్యాదులో పేర్కొంది. వారు, ఆడపడుచు ఆమె భర్త ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టాలంటూ కొద్దినెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె చెబుతోంది. ఈ మేరకు పోలీసులు హర్ష అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబసభ్యులకు భారం కాకూడదని..
నెల్లూరు, నాయుడుపేటటౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న యువతి కుటుంబసభ్యులకు భారం కాకూడదనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పినట్లు సూళ్లూరుపేట రైల్వే ఎస్సై కిష్టయ్య బుధవారం వెల్లడించారు. నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం సంఘమిత్ర రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువతి ఆచూకి లభ్యమైంది. మండల పరిధిలోని మర్లపల్లి గ్రామానికి చెందిన ఏలూరు నర్మద (20)గా రైల్వే పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన నర్మద శ్రీసిటీలోని సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె తల్లి సంపూర్మ కూడా మేనకూరు సెజ్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతంలో సంపూర్ణ భర్త రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నర్మద ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందింది. అయితే తన అనారోగ్యంతో కుటుంబసభ్యులు అవస్థలు పడకూడదని ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యకు పూనుకున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. యువతి మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి వారికి అప్పగించారు. గ్రామస్తులు అనేకమంది వైద్యశాల వద్దకు చేరుకుని కంటతడి పెట్టారు. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
4 లక్షల టన్నుల చెరకు గానుగ లక్ష్యం
తోటలను పరిశీలించిన అసిస్టెంట్ కేన్ కమిషనర్ లోకేశ్వర్ నాయుడుపేట: జిల్లాలో సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీ, ఎంపీ చక్కెర కర్మాగారాల పరిధిలో 4లక్షల టన్నుల చెరకు గానుగ లక్ష్యమని జిల్లా అసిస్టెంట్ కేన్ కమిషనర్ కె.లోకేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని చెరుకు తోటలను శనివారం కమిషనర్ పరిశీలించారు. కాపులూరు, కూచివాడ, గునపాడు, పెన్నేపల్లి, పెళ్లకూరు మండలం చెంబేడు, చావాలి గ్రామాలలో చెరకు పంట నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేన్ కమీషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,611 టన్నులు ఎంపీ షుగర్స్ ఫ్యాక్టరీలోనూ, 27,259 టన్నులు సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీలో గానుగ ఆడించినట్లు తెలిపారు. టన్నుకు రూ.2,500లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎంపీ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ మాట్లాడుతూ విత్తన తోటలకు ఎకరానికి నాలుగు టన్నుల చెరకును ఉచితంగా ఫ్యాక్టరీ అందిస్తుందని తెలిపారు. ఆయన వెంట సీఈఓ శివరామ్‌ప్రసాద్, క్షేత్రస్థాయి ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ
తండ్రి దుర్మరణం కుమారుడికి తీవ్రగాయాలు క్షేమంగా భార్య, కుమార్తె చలివేంద్ర (నాయుడుపేటటౌన్) : మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని చలివేంద్రం సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని వద్దిగుంట కండ్రిగకు చెందిన పిగిలం అశోక్ (28) అలియాస్ కిరణ్ తన భార్య ప్రభావతి, పిల్లలు హర్షవర్ధన్, రోహితిలను తీసుకుని శనివారం చిల్లకూరు మండలం తిమ్మనగారిపాళెంలో అత్తంటికి వెళ్లేందుకు మోటారు బైక్‌పై బయలుదేరాడు. మేనకూరు పంచాయతీ చలివేంద్రం వద్దకు వచ్చే సరికి రహదారిపై ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న అశోక్‌తో పాటు ముందు కూర్చుని ఉన్న ఎల్కేజీ చదువుతున్న కుమారుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. భార్య ప్రభావతితో పాటు చిన్నారి రోహితి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ¯ðనెల్లూరుకు తరలించారు. ఎస్ఐ మారుతీకృష్ణ, ఏఎస్ఐ శంకర్రాజు లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిన్నంటిన రోదనలు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. మృతుడి భార్య ప్రభావతి గుండెలు బాదుకుంటూ రోదించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అశోక్ ఆమె తల్లి బుజ్జమ్మ మతిస్థిమితం తప్పినట్లుగా ఆస్పత్రి ప్రాంగణంలో అటూ ఇటూ పరుగులు పెట్టడంతో ఆమెను సముదాయించేందుకు అవస్థలు పడ్డారు. -
ఘనంగా మౌలాలి పంజా ఊరేగింపు
నాయుడుపేటటౌన్ : మొహరం పండగను పురస్కరించుకుని పట్టణంలోని గరిడివీధిలో ఉన్న తాలీమ్‌ఖానా వద్ద నుంచి హజరత్ మౌలాలి పంజా ఊరేగింపును శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గరిడిలోని మౌలాలి తాలీమ్‌ఖానాలో ప్రతిష్టించిన పంజాను గుర్రంపై ఉంచి ఫాతెలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక మంది పంజా వద్దకు వచ్చి అటుకులు, బెల్లం, శనగలు, చక్కెర తదితర వాటితో ఫాతెలు జరిపి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అలాగే అనేకమంది భక్తులు పంజాలను చేతపట్టి భక్తిశ్రద్ధలతో ఇళ్ల వద్ద నుంచి ఊరేగింపుగా వచ్చి తాలీమ్‌ఖానాలో ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మౌలాలీ పంజా ఊరేగింపులో పులి వేషాలు, తపెట్ల తాళ్లలతో కోలహలంగా నిర్వహించారు. మౌలాలి తాలీమ్‌ఖానా సభ్యులతో పాటు గరిడి యువత, గ్రామపెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటారా..
ఎంపీడీఓను ఫోన్లో నిలదీసిన గొట్టిప్రోలు వాసులు నాయుడుపేట: ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నగదును రికవరీ చేయాలని కోరితే చెప్పుతో కొడతామని బెదిరిస్తారా..అని గొట్టిప్రోలు వాసులు నాయుడుపేట ఎంపీడీఓ శివయ్యపై మండిపడ్డారు. గ్రామంలోని కూలీలందరూ మంగళవారం గ్రామంలోని రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవినీతి సొమ్ము రికవరీపై అక్కడి నుంచే ఎంపీడీఓకు ఫోన్ చేశారు. ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడంతో పాటు రికవరీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. 2014లో జరిగిన సామాజిక తనిఖీలో రూ.2 లక్షల కూలీల నగదును సీఎస్పీ స్వాహా చేశారని తేలినా ఎందుకు రికవరీ చేయలేదో చెప్పాలని కోరారు. వీటికి సమాధానం చెప్పకుండా తమను చెప్పుతో కొడతానని ఎంపీడీఓ శివయ్య బెదిరించాడని గొట్టిప్రోలు వాసులు వాపోయారు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకుండా స్విచ్ఛాఫ్ చేశారన్నారు. తమ కాయకష్టాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకోమని కోరితే ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఇష్టారాజ్యంగా వైద్యపరీక్షలు జరిపితే చర్యలు
వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ నాయుడుపేటటౌన్: విషజ్వరాల పేరుతో రోగులను భయపెట్టి ఇష్టారాజ్యంగా వైద్యపరీక్షలు జరిపే ప్రైవేటు వైద్యశాలలపై చర్యలు తీసుకుంటామని వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. నాయుడుపేట నగర పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నగర పంచాయతీలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను కమిషనర్ ప్రసాద్నాయుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజులకుపైగా జ్వరం వస్తుంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లో డెంగీ, చికిన్‌గున్యా వ్యాధులను గుర్తించినా ప్రభుత్వ వైద్యశాలకు పంపాలని సూచించారు. అనుమతి లేకుండా నిర్వహించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఆరోగ్య విస్తరణాధికారి దాసరి శ్రీనివాసులు, మేనేజర్ ఉమామహేశ్వరరావు ఉన్నారు. -
నాయుడుపేటలో పతంజలి ప్లాంట్
యోగా గురు బాబా రాందేవ్ • తయారీ కేంద్రం కోసం 200 ఎకరాలు సేకరించాం... • ఏపీ, తెలంగాణాలో ప్రతి జిల్లాలో • పతంజలి ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు • త్వరలోనే శిశు సంరక్షణ, డెయిరీ ఉత్పత్తులు సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ లోని నాయుడుపేటలో పతంజలి ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. ఏపీ , తెలంగాణాలోని జిల్లా కేంద్రాలలో పతంజలి ఆరోగ్య కేంద్రాలు, ఆచార్యకులం స్కూళ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని బాబా రాందేవ్ చెప్పారు. నానాటికీ పెరుగుతున్న పతంజలి ఉత్పత్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఏపీలో రైతుల నుంచి నేరుగా సోనా మసూరి బియ్యం కొనుగోలు చేస్తామని, అందుకు బియ్యం ప్యాకేజింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామని హరిద్వార్‌లోని తమ సంత్ కుటీరంలో ‘సాక్షి’ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ వెల్లడించారు. ముందుగా ఏపీ, తెలంగాణాతో ఉన్న అనుబంధాన్ని బాబా రాందేవ్ గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో సగభాగానికి పైగా తాను పర్యటించానని, తెలుగు కొంత మేరకు తెలుసని చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు... తెలుగు రాష్ట్రాలలో పతంజలి ట్రస్ట్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దేశవ్యాప్తంగా పతంజలి ట్రస్ట్ కొత్తగా 6 పతంజలి ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభిస్తోంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కేంద్రానికి ఇటీవల శంకుస్ధాపన చేశాం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, అస్సాంలోని గౌహతి, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఏపీలలో పతంజలి ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభిస్తాం. ఏపీలోని నాయుడుపేటలో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు 200 ఎకరాల భూమి ఇప్పటికే సేకరించాం. పతంజలి ఉత్పత్తులను నాయుడుపేట నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా పతంజలి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించాం. పతంజలి సబ్బు, షాంపూ, అలివెరా జెల్ ఉత్పత్తిని రెట్టింపు చేస్తున్నాం. దేశంలో 6 పెద్ద హెర్బల్ ఫుడ్ పార్క్‌ల పేరిట ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో పాటుగా 50 చిన్న యూనిట్లను ప్రారంభిస్తాం. బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా అభియాన్ ప్రారంభించారు. దాని లక్ష్యాలేమిటి? బహుళజాతి కంపెనీలు దేశాన్ని లూటీ చేస్తున్నాయి. రానున్న 5 ఏళ్లలో బహుళజాతి కంపెనీల లూటీ నుంచి దేశానికి విముక్తి కలిగించడం నా కల. అందుకు అనుగుణంగా బహుళజాతి కంపెనీల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాం. పతంజలి ఉత్పత్తులపై ప్రజలకు అత్యంత విశ్వాసం ఉంది. అందువల్లే ఆర్థిక స్వరాజ్యం అభియాన్‌ను ప్రారంభించాం. ఈ అభియాన్‌లో 4 ప్రధాన ఉద్దేశ్యాలున్నాయి. ఆర్థిక శక్తి, రాజకీయ శక్తి, మిలటరీ శక్తి, మేథో శక్తి. ఈ నాలుగు శక్తులతోటే ప్రపంచం నడుస్తుంది. ఈ నాలుగు శక్తులలో భారతదేశం ఆధిపత్య స్ధానంలో ఉండాలన్నదే మా అభిమతం. నైతిక శక్తి రాజకీయ శక్తి కంటే గొప్పది. యోగాతో దేశంలో నైతిక ఆధ్యాత్మిక శక్తిని ఉద్ధరించడం. ఆయుర్వేదంతో దేశాన్ని ప్రపంచ ఆరోగ్య మార్గ దర్శక దేశంగా మార్చడం మా లక్ష్యం. పతంజలి ట్రస్ట్ పై వచ్చిన పలు ఆరోపణలపై ఇటీవల పార్లమెంట్లో కూడా ప్రస్తావన వచ్చింది? కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారు. బాబా దగ్గర రీసెర్చ్ సదుపాయం ఏముందని అడుగుతారు. ఉత్పత్తుల మాట వచ్చినప్పుడు పరిశోధనా సదుపాయాల మాట వస్తుంది. మా దగ్గర 200 మంది సీనియర్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలిచ్చాం. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించడం. పరోక్షంగా 5 కోట్ల మందికి ఉపాధి కల్పించాలన్నది మా లక్ష్యం. సాధువులకు వ్యాపారం ఎందుకు అనే విమర్శలు వస్తున్నాయి? సాధువుకు ఇంత వ్యాపారం ఎందుకని ఆరోపణలు చేస్తుంటారు. సన్యాసులు తమ కోసం ఏమీ చేయరు. సామాజిక సేవ కోసమే వారు పని చేస్తారు. ఆది శంకరాచార్య అదే పని చేశారు. ఆది కాలం నుంచి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సైన్స్ తదితర రంగాలలో రుషులు మార్గదర్శనం చేసేవారు. పతంజలి ఉత్పత్తులపై పలు కేసులుఉన్నాయి? పతంజలి ట్రస్ట్ ప్రభుత్వ రూల్స్‌ని పాటిస్తుంది. అయినప్పటికీ కొందరు కావాలని కేసులు పెడతారు. గతంలో చాలా కేసులు పెట్టారు. ఒక్కటి కూడా రుజువు కాలేదు. అదే మాశక్తి. అదే మా బ్రాండ్. పతంజలి ఉత్పత్తులలోని లేబుల్‌లో క్లెయిమ్ చేసిందే ఆ ఉత్పత్తులలో ఉంటుంది. పతంజలి ఉత్పత్తుల బలమే ఇది. మా శక్తి ఇదే. ఏదైనా బ్రాండ్ ప్రజల విశ్వాసం, భావోద్వేగాలతో ఏర్పడుతుంది. ఈ వస్తువులను వాడండి అంటూ పలువురు సెలబ్రిటీలు, సినీ హీరో హీరోయిన్లు బ్రాండ్లనే ఎండార్స్ చేస్తారు. బ్రాండ్ అంబాసిడర్లు ఏ విధమైన నైతిక బాద్యత వహించరు. కానీ మాకు నైతిక బాధ్యత ఉంది. పిల్లల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేస్తాం. పిల్లల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులలో మసాజ్ ఆయిల్, షాంపూ, బాత్ జెల్ కూడా ఉంటాయి. వీటిని దేశవ్యాప్తంగా రెండు నెలలలో మార్కెట్లోకి విడుదల చేస్తాం. పతంజలి ఉత్పత్తులలో పవర్ వీటా కు మంచి గిరాకీ ఉంది. దాంతో బోర్నవిటా, హార్లిక్స్ తయారీదారులు కలవరపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి డెయిరీ ఉత్పత్తులను త్వరలోనే మార్కెట్ లోకి తెస్తాం. డెయిరీ మిల్క్, ఛీజ్, బటర్ తదితర ఉత్పత్తులను రెండు నెలల్లో విడుదల చేస్తాం. రైతులకు నేరుగా లబ్ధి కల్పిస్తున్నామని చెప్పారు. ఏ విధంగా లబ్ధి చేకూరుతోంది? రైతులకు నేరుగా లబ్ధి పతంజలి నుంచే లభిస్తోంది. ఒక ఏడాది లోపల ప్రతి రోజూ 10 వేల టన్నుల గోధుమలు, 10 వేల టన్నుల బియ్యం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం ప్రతి రోజూ 5 వేల టన్నుల గోధుమలు, వెయ్యి టన్నుల బియ్యం కొనుగోలు చేస్తున్నాం. రసాయనాలేవీ లేకుండా రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్, వేరుశనగ, కొబ్బరినూనెల మార్కెటిం గ్ ప్రారంభిస్తాం. దేశ వ్యాప్తంగా 500 ఆచార్యకులం స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. మెకాలే విద్యావిధానాన్ని పక్కనపెట్టి సంస్కారంతోకూడిన విద్య ను అందించాల్సిన ఆవశ్యకత ఉంది. నాలెడ్జ్‌లో, కేరక్టర్‌లోనూ నంబర్ వన్‌గా ఉండేలా విద్య ఉండాలి. గురు కులం స్కూళ్లలో విద్య కేవలం సంస్కృతంపై ఆధారపడి ఉంటుంది. ఆచార్యకులం స్కూల్లో 100% ఆధునిక విద్యతో పాటు వైదిక విద్యనూ బోధిస్తారు. పతంజలి విశ్వవిద్యాలయంలో టీచర్లు, వైద్యులకు శిక్షణ ఇస్తున్నాం. దేశ వ్యాప్తంగా ప్రపంచస్ధాయి ప్రమాణాలతో 500 స్కూళ్ల ఏర్పాటు చేస్తాం. -
మెట్లపై నుంచి జారిపడి వృద్ధుడి మృతి
నాయుడుపేటటౌన్ : ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శివాలయం సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... తమిళనాడు ప్రాంతానికి చెందిన ముప్పాల నారాయణ (70) నాయుడుపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, పిల్లలు లేరు. పలు దుకాణాల్లో పనిచేస్తూ పాఠశాలలో నిద్రిస్తుంటాడు. పట్టణానికి చెందిన యద్దల ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం కుటుంబీకులు అతనికి చేదోడుగా వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ భోజన వసతి ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఇబ్రహీం పిల్లలకు బక్రీద్ పండగ సందర్భంగా వస్తువులు కొనిచ్చేందుకు ఇంటి మిద్దెపైకి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాతు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఏఎస్సై శంకర్రాజు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నారాయణను ఆదరించిన కుటుంబీకులకు అప్పగించారు. ఆదరించిన కుటుంబాల రుణం తీర్చుకున్న మృతుడు అనాథగా ఉన్న వృద్ధుడు నారాయణను ఆదరించిన ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం కుటుంబాల రుణం తీర్చుకునేలా చర్యలు చేపట్టడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల పేర లక్షల రూపాయల నగదును వారి పేరున ఇన్సూరెన్స్ చేసి ఉన్నాడు. దీంతో నారాయణకు అంత్యక్రియలను ఇరు కుటుంబాలు కలిసి నిర్వహించారు. అయితే మృతుడికి ప్రతాప్‌రెడ్డి తలకొరివి పెట్టి అతని రుణాన్ని తీర్చుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల బాగోగులు చూస్తుండే నారాయణ మృతి పట్ల ఆ పాఠశాల హెచ్ఎం బాబుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
రంగురాళ్లు తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
5 బస్తాల రంగురాళ్లు స్వాధీనం దాచేపల్లి : అక్రమంగా రంగురాళ్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురవారం అరెస్ట్ చేశారు. సారంగపల్లి అగ్రహారానికి చెందిన జాఠవత్ కొండా నాయక్, ఆదూరి నరసింహారావు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తుండటంతో అరెస్ట్ చేసి గురజాల కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై కట్టా ఆనంద్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. శంకరపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో రంగురాళ్లను అక్రమంగా తవ్వించి విక్రయించేందుకు వాహనంలో తరలిస్తున్నారు. దాచేపల్లిలోని నాయుడుపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 5 బస్తాల రంగురాళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రంగురాళ్లను తరలిస్తున్న కొండానాయక్, నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై ఆనంద్ వెల్లడించారు. -
వారం ఆగాల్సిందే
సాక్షి, నెల్లూరు : పుర ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత నెల 30న జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయని, వాటి ఫలితాలను వాయిదా వేయాలని కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న కౌంటింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజానీకానికి మరో వారం పాటు టెన్షన్ తప్పదు. జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయపార్టీల మధ్య హోరాహోరీగా పోరులో విజయాలు ఎవరిని వరిస్తాయో తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంది. జిల్లాలో ఏ నలుగురు ఒకచోట కలిసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూంల వద్ద బందోబస్తు పోలీసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ఎప్పుడెప్పుడు తమ బాధ్యతలు పూర్తవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరి కొద్ది రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల పర్వం పూర్తయిందనిపిస్తే ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు చూడాల్సి ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ తంతు త్వరగా ముగించాలని చూస్తోంది. అయితే మరో వారంకైనా ఫలితాలు విడుదలవుతాయా? లేక సుప్రీంకోర్టులో అడ్డంకి ఏర్పడుతుందా అనే అనుమానం లేకపోలేదు.