అవినీతిపై ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటారా..
-
ఎంపీడీఓను ఫోన్‌లో నిలదీసిన గొట్టిప్రోలు వాసులు
నాయుడుపేట: ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నగదును రికవరీ చేయాలని కోరితే చెప్పుతో కొడతామని బెదిరిస్తారా..అని గొట్టిప్రోలు వాసులు నాయుడుపేట ఎంపీడీఓ శివయ్యపై మండిపడ్డారు. గ్రామంలోని కూలీలందరూ మంగళవారం గ్రామంలోని రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవినీతి సొమ్ము రికవరీపై అక్కడి నుంచే ఎంపీడీఓకు ఫోన్ చేశారు. ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడంతో పాటు రికవరీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. 2014లో జరిగిన సామాజిక తనిఖీలో రూ.2 లక్షల కూలీల నగదును సీఎస్‌పీ స్వాహా చేశారని తేలినా ఎందుకు రికవరీ చేయలేదో చెప్పాలని కోరారు. వీటికి సమాధానం చెప్పకుండా తమను చెప్పుతో కొడతానని ఎంపీడీఓ శివయ్య బెదిరించాడని గొట్టిప్రోలు వాసులు వాపోయారు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకుండా స్విచ్ఛాఫ్ చేశారన్నారు. తమ కాయకష్టాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకోమని కోరితే ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.