బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ
సాక్షి, అమరావతి/ పెనమలూరు: నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గురువారం ఫోన్‌లో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని వెంకటరమణారావు ఇంటికి పశ్చిమగోదావరి జల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేరుకున్నారు. ఎంపీడీఓ భార్య సునీత, కుటుంబ సభ్యులతో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు.
ఆ తరువాత సునీతతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలు సీఎంఓకు తెలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీఓ వెంకటరమణారావు రాసిన సూసైడ్ నోట్‌లో విషయాలపై విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఏ సమాచారం తెలిసినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మధునాయుడు, పలువురు టీడీపీ నేతలు ఎంపీడీఓ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఏలూరు కాలువలో విస్తృతంగా గాలిస్తోంది. గురువారం రాత్రికి కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతామని పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment