సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్‌లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు.
కిడ్నాప్‌నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది.
పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి
క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment