బైక్‌ను ఢీకొన్న లారీ
-
తండ్రి దుర్మరణం
-
కుమారుడికి తీవ్రగాయాలు
-
క్షేమంగా భార్య, కుమార్తె
చలివేంద్ర (నాయుడుపేటటౌన్) : మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని చలివేంద్రం సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని వద్దిగుంట కండ్రిగకు చెందిన పిగిలం అశోక్ (28) అలియాస్ కిరణ్ తన భార్య ప్రభావతి, పిల్లలు హర్షవర్ధన్, రోహితిలను తీసుకుని శనివారం చిల్లకూరు మండలం తిమ్మనగారిపాళెంలో అత్తంటికి వెళ్లేందుకు మోటారు బైక్‌పై బయలుదేరాడు. మేనకూరు పంచాయతీ చలివేంద్రం వద్దకు వచ్చే సరికి రహదారిపై ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న అశోక్‌తో పాటు ముందు కూర్చుని ఉన్న ఎల్‌కేజీ చదువుతున్న కుమారుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. భార్య ప్రభావతితో పాటు చిన్నారి రోహితి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ¯ðనెల్లూరుకు తరలించారు. ఎస్‌ఐ మారుతీకృష్ణ, ఏఎస్‌ఐ శంకర్‌రాజు లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిన్నంటిన రోదనలు
కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. మృతుడి భార్య ప్రభావతి గుండెలు బాదుకుంటూ రోదించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అశోక్ ఆమె తల్లి బుజ్జమ్మ మతిస్థిమితం తప్పినట్లుగా ఆస్పత్రి ప్రాంగణంలో అటూ ఇటూ పరుగులు పెట్టడంతో ఆమెను సముదాయించేందుకు అవస్థలు పడ్డారు.