రెప్పపాటులో ఢీకొన్న మూడు వాహనాలు
రామాపురం(తడ) : తమిళనాడు సరిహద్దులో రామాపురం కుప్పం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో టిప్పర్, లారీ, పరిశ్రమ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 32 మందికి తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు..తమిళనాడుకు చెందిన టిప్పర్ శ్రీకాళహస్తి నుంచి రాతి పొడిని(డస్ట్) తీసుకెళుతోంది. టిప్పర్ రామాపురం కుప్పం వద్దకు చేరుకునే సరికి డివైడర్‌ను దాటుతూ ద్విచక్ర వాహనదారుడు అడ్డు వచ్చాడు. దీంతో టిప్పర్ డ్రైవర్ మదన్(32) బైక్‌ను తప్పించేందుకు షడన్ బ్రేక్ వేశాడు.
దీంతో టిప్పర్ డివైడర్‌ని ఢీకొని టైర్లు పేలిపోయాయి. దీంతో టిప్పర్ అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో తమిళనాడు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఖాళీ లారీ అకస్మాత్తుగా రోడ్డుపై అడ్డు వచ్చిన టిప్పర్‌ని వేగంగా ఢీకొంది. ఖాళీ లారీ వెనుకగా కార్మికులతో చెన్నై నుంచి శ్రీసిటీకి వస్తున్న సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ బస్సు అదుపుతప్పి ఢీకొంది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో పాత గుమ్మిడిపూండికి చెందిన ట్రిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఖాళీ లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ సతీష్ కాలుతెగిపోయింది.
స్థానికులు బయటకు తీసి తమిళనాడు అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం చెన్నై పంపారు. బస్సులో ముగ్గురు మహిళా ఉద్యోగులతో పాటు 29 మంది కార్మికులు ఉండగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయడిన వారిని తమిళనాడు అంబులెన్స్‌లో చెన్నై తరలించగా> పలువురిని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చెన్నై తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట సీఐ ఎన్ కిషోర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, పోలీసుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment