ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ దుర్మరణం | Junior Artist Died In Road Accident At Nellore district | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ దుర్మరణం

Published Tue, Jun 26 2018 10:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Junior Artist Died In Road Accident At Nellore district - Sakshi

ఘటనా స్థలంలో నన్నం సునీల్‌ మృతదేహం.. నుజ్జునుజ్జు అయిన కారు(ఇన్‌సెట్లో)

సాక్షి, నెల్లూరు: మితిమీరిన వేగంతో వెళ్తున్న గుర్తు తెలియని ఓ లారీ వెనుక నుంచి కారును ఢీకొనడంతో ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై అంజిరెడ్డి సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలంం పెనుబల్లి దళితవాడకు చెందిన నన్నం సునీల్‌ (24), కోవూరు మండలం పెద పడుగుపాడుకు చెందిన షేక్‌ సలాఉద్దీన్‌ స్నేహితులు. సలాఉద్దీన్‌ సోదరుడు షకీల్‌ హైదరాబాద్‌లో మ్యూజిక్‌ డైరక్టర్‌గా పనిచేస్తున్నాడు. సునీల్, సలాఉద్దీన్‌ కూడా షకీల్‌ వద్దే హైదరాబాద్‌లో ఉంటూ సినిమా, టీవీల్లో అవకాశాలు కోసం యత్నిస్తున్నారు. సునీల్‌ పున్నాగు టీవీ సీరియల్, వరంగల్‌ అనే సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు.

ఈ క్రమంలో సునీల్‌ తల్లికి డబ్బులు అవసరం కావడంతో ఇచ్చేందుకు సునీల్, సలాఉద్దీన్‌ ఇద్దరు కలిసి షకీల్‌ కారులో ఆదివారం రాత్రి నెల్లూరుకు బయలుదేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సునీల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సలాఉద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డారు. సలాఉద్దీన్‌ను 108 సిబ్బంది నెల్లూరు సింహపురి వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు ఏఎస్‌ఐ శ్రీనాథ్‌ తెలిపారు. ఆర్టిస్ట్‌గా ఎదుగుతున్న తరుణంలో సునీల్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కారును ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో ఏ వాహనం ఢీకొన్నది గుర్తించలేకపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement