ఇష్టారాజ్యంగా వైద్యపరీక్షలు జరిపితే చర్యలు
-
వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్
నాయుడుపేటటౌన్: విషజ్వరాల పేరుతో రోగులను భయపెట్టి ఇష్టారాజ్యంగా వైద్యపరీక్షలు జరిపే ప్రైవేటు వైద్యశాలలపై చర్యలు తీసుకుంటామని వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. నాయుడుపేట నగర పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నగర పంచాయతీలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను కమిషనర్ ప్రసాద్‌నాయుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజులకుపైగా జ్వరం వస్తుంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లో డెంగీ, చికిన్‌గున్యా వ్యాధులను గుర్తించినా ప్రభుత్వ వైద్యశాలకు పంపాలని సూచించారు. అనుమతి లేకుండా నిర్వహించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఆరోగ్య విస్తరణాధికారి దాసరి శ్రీనివాసులు, మేనేజర్ ఉమామహేశ్వరరావు ఉన్నారు.