సాక్షి, నెల్లూరు : భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, అండగా నిలవాల్సిన అత్తమామలే ఆస్తి కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట పట్టణానికి చెందిన సాదు హర్ష అనే యువతిని 2016 ఆగస్ట్ నెలలో వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన సాదు చంద్రశేఖర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేశారు. హర్ష, చంద్రశేఖర్‌లు బెంగళూరులో నివాసముండేవారు.
2018 ఫిబ్రవరి నెలలో చంద్రశేఖర్ స్నేహితుడి వివాహం కోసం స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. భర్త మరణించడంతో హర్ష అత్తమామల వద్దే ఉంటోంది. ఈక్రమంలో అండగా ఉండాల్సిన అత్తమామలు తనకు పిల్లల్లేరని, భర్త ఆస్తి తమకే చెందుతుందని చెప్పారని హర్ష ఫిర్యాదులో పేర్కొంది. వారు, ఆడపడుచు ఆమె భర్త ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టాలంటూ కొద్దినెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె చెబుతోంది. ఈ మేరకు పోలీసులు హర్ష అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment