పాలకుర్తి టౌన్: ఆస్తి వివాదంలో ఓ తనయుడు తండ్రిని కొట్టి చంపాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్నులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈరవెన్ను గ్రామానికి చెందిన చిడిమిండ్ల నర్సిరెడ్డి (57)కి రాజు, రమేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత ఏడాది ఇద్దరు కుమారులకు మూడు ఎకరాల చొప్పున పంపకాలు చేశాడు. ఎకరం 20 గుంటల భూమిని తన భాగంగా తీసుకున్నాడు.
కాగా, తరచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నర్సిరెడ్డి భార్య చనిపోవడంతో అతను చిన్న కుమారుడు రమేశ్ వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా పెద్ద కుమారుడు రాజు తనకు అప్పులు పెరిగాయని, ఇంటిని అమ్మాలంటూ గొడవ పడుతుండేవాడు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇంటి పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తండ్రిని, తమ్ముడిని చంపుతానని బెదిరించేవాడు.
ఈ క్రమంలో గురువారం నర్సిరెడ్డి పొలం పనులు చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా రాజు వెళ్లి గొడవ పడ్డాడు. తండ్రిని బురదలో పడేసి తలపై కొట్టి చంపాడు. నర్సిరెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతనికోసం కుటుంబ సభ్యులు వెతకగా రాత్రి సమయంలో పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై శుక్రవారం రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ విశ్వేశ్వర్, ఎస్సైశ్రీకాంత్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: బాత్‌రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు..
Comments
Please login to add a commentAdd a comment