నాయుడుపేటలో పతంజలి ప్లాంట్ | yoga guru Baba Ramdev Patanjali manufacturing center in Nayudupeta ,ap | Sakshi
Sakshi News home page

నాయుడుపేటలో పతంజలి ప్లాంట్

Published Wed, Sep 14 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

నాయుడుపేటలో పతంజలి ప్లాంట్

నాయుడుపేటలో పతంజలి ప్లాంట్

యోగా గురు బాబా రాందేవ్
తయారీ కేంద్రం కోసం 200 ఎకరాలు సేకరించాం...
ఏపీ, తెలంగాణాలో ప్రతి జిల్లాలో
పతంజలి ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు
త్వరలోనే శిశు సంరక్షణ, డెయిరీ ఉత్పత్తులు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ లోని నాయుడుపేటలో పతంజలి ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. ఏపీ , తెలంగాణాలోని జిల్లా కేంద్రాలలో పతంజలి ఆరోగ్య కేంద్రాలు, ఆచార్యకులం స్కూళ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని బాబా రాందేవ్ చెప్పారు. నానాటికీ పెరుగుతున్న పతంజలి ఉత్పత్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఏపీలో రైతుల నుంచి నేరుగా సోనా మసూరి బియ్యం కొనుగోలు చేస్తామని, అందుకు బియ్యం ప్యాకేజింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామని హరిద్వార్‌లోని తమ సంత్ కుటీరంలో ‘సాక్షి’ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ వెల్లడించారు.  ముందుగా ఏపీ, తెలంగాణాతో ఉన్న అనుబంధాన్ని బాబా రాందేవ్ గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో సగభాగానికి పైగా తాను పర్యటించానని, తెలుగు కొంత మేరకు తెలుసని చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు...

తెలుగు రాష్ట్రాలలో పతంజలి ట్రస్ట్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?
దేశవ్యాప్తంగా పతంజలి ట్రస్ట్ కొత్తగా 6 పతంజలి ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభిస్తోంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కేంద్రానికి ఇటీవల శంకుస్ధాపన చేశాం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, అస్సాంలోని గౌహతి, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఏపీలలో పతంజలి ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభిస్తాం. ఏపీలోని నాయుడుపేటలో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు 200 ఎకరాల భూమి ఇప్పటికే సేకరించాం. పతంజలి ఉత్పత్తులను నాయుడుపేట నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా పతంజలి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించాం. పతంజలి సబ్బు, షాంపూ, అలివెరా జెల్ ఉత్పత్తిని రెట్టింపు చేస్తున్నాం.  దేశంలో 6 పెద్ద హెర్బల్ ఫుడ్ పార్క్‌ల పేరిట ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో పాటుగా 50 చిన్న యూనిట్లను  ప్రారంభిస్తాం.

బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా అభియాన్ ప్రారంభించారు. దాని లక్ష్యాలేమిటి?
బహుళజాతి కంపెనీలు దేశాన్ని లూటీ చేస్తున్నాయి. రానున్న 5 ఏళ్లలో బహుళజాతి కంపెనీల లూటీ నుంచి దేశానికి విముక్తి కలిగించడం నా కల. అందుకు అనుగుణంగా బహుళజాతి కంపెనీల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాం.  పతంజలి ఉత్పత్తులపై ప్రజలకు అత్యంత విశ్వాసం ఉంది. అందువల్లే ఆర్థిక స్వరాజ్యం అభియాన్‌ను ప్రారంభించాం.  ఈ అభియాన్‌లో 4 ప్రధాన ఉద్దేశ్యాలున్నాయి. ఆర్థిక శక్తి, రాజకీయ శక్తి, మిలటరీ శక్తి, మేథో శక్తి. ఈ నాలుగు శక్తులతోటే ప్రపంచం నడుస్తుంది. ఈ నాలుగు శక్తులలో భారతదేశం  ఆధిపత్య స్ధానంలో ఉండాలన్నదే మా అభిమతం.  నైతిక శక్తి రాజకీయ శక్తి కంటే గొప్పది. యోగాతో దేశంలో నైతిక ఆధ్యాత్మిక శక్తిని ఉద్ధరించడం. ఆయుర్వేదంతో దేశాన్ని  ప్రపంచ  ఆరోగ్య మార్గ దర్శక దేశంగా మార్చడం మా లక్ష్యం.

పతంజలి ట్రస్ట్ పై వచ్చిన పలు ఆరోపణలపై ఇటీవల పార్లమెంట్‌లో కూడా ప్రస్తావన వచ్చింది?
కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారు. బాబా దగ్గర రీసెర్చ్ సదుపాయం ఏముందని అడుగుతారు. ఉత్పత్తుల మాట వచ్చినప్పుడు పరిశోధనా సదుపాయాల మాట వస్తుంది. మా దగ్గర 200 మంది సీనియర్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలిచ్చాం. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించడం. పరోక్షంగా 5 కోట్ల మందికి ఉపాధి కల్పించాలన్నది మా లక్ష్యం.
సాధువులకు వ్యాపారం ఎందుకు అనే విమర్శలు వస్తున్నాయి?
సాధువుకు ఇంత వ్యాపారం ఎందుకని ఆరోపణలు చేస్తుంటారు. సన్యాసులు తమ కోసం ఏమీ చేయరు. సామాజిక సేవ కోసమే వారు పని చేస్తారు. ఆది శంకరాచార్య అదే పని చేశారు. ఆది కాలం నుంచి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సైన్స్ తదితర రంగాలలో రుషులు మార్గదర్శనం చేసేవారు.

పతంజలి ఉత్పత్తులపై పలు కేసులుఉన్నాయి?
పతంజలి ట్రస్ట్  ప్రభుత్వ రూల్స్‌ని పాటిస్తుంది. అయినప్పటికీ కొందరు కావాలని కేసులు పెడతారు. గతంలో చాలా కేసులు పెట్టారు. ఒక్కటి కూడా రుజువు కాలేదు. అదే మాశక్తి. అదే మా బ్రాండ్. పతంజలి ఉత్పత్తులలోని లేబుల్‌లో క్లెయిమ్ చేసిందే ఆ ఉత్పత్తులలో ఉంటుంది.  పతంజలి ఉత్పత్తుల బలమే ఇది.  మా శక్తి ఇదే. ఏదైనా బ్రాండ్ ప్రజల విశ్వాసం, భావోద్వేగాలతో ఏర్పడుతుంది. ఈ వస్తువులను వాడండి అంటూ పలువురు సెలబ్రిటీలు, సినీ హీరో హీరోయిన్‌లు బ్రాండ్‌లనే ఎండార్స్ చేస్తారు. బ్రాండ్ అంబాసిడర్‌లు ఏ విధమైన నైతిక బాద్యత  వహించరు.

కానీ మాకు నైతిక బాధ్యత ఉంది. పిల్లల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేస్తాం. పిల్లల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులలో  మసాజ్ ఆయిల్, షాంపూ, బాత్ జెల్ కూడా ఉంటాయి.  వీటిని దేశవ్యాప్తంగా రెండు నెలలలో మార్కెట్‌లోకి విడుదల చేస్తాం. పతంజలి ఉత్పత్తులలో పవర్ వీటా కు మంచి గిరాకీ ఉంది. దాంతో బోర్నవిటా, హార్లిక్స్ తయారీదారులు కలవరపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి డెయిరీ ఉత్పత్తులను త్వరలోనే మార్కెట్ లోకి తెస్తాం. డెయిరీ మిల్క్, ఛీజ్, బటర్ తదితర ఉత్పత్తులను రెండు నెలల్లో విడుదల చేస్తాం.

రైతులకు నేరుగా లబ్ధి కల్పిస్తున్నామని చెప్పారు. ఏ విధంగా లబ్ధి చేకూరుతోంది?
రైతులకు నేరుగా లబ్ధి పతంజలి నుంచే లభిస్తోంది. ఒక ఏడాది లోపల ప్రతి రోజూ 10 వేల టన్నుల గోధుమలు, 10 వేల టన్నుల బియ్యం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం ప్రతి రోజూ 5 వేల టన్నుల గోధుమలు, వెయ్యి టన్నుల బియ్యం కొనుగోలు చేస్తున్నాం.  రసాయనాలేవీ లేకుండా రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్, వేరుశనగ, కొబ్బరినూనెల మార్కెటిం గ్ ప్రారంభిస్తాం.  దేశ వ్యాప్తంగా 500 ఆచార్యకులం స్కూళ్లను ఏర్పాటు  చేస్తాం.

మెకాలే విద్యావిధానాన్ని పక్కనపెట్టి సంస్కారంతోకూడిన విద్య ను అందించాల్సిన ఆవశ్యకత ఉంది.  నాలెడ్జ్‌లో, కేరక్టర్‌లోనూ నంబర్ వన్‌గా ఉండేలా విద్య ఉండాలి.  గురు కులం స్కూళ్లలో విద్య కేవలం సంస్కృతంపై ఆధారపడి ఉంటుంది. ఆచార్యకులం స్కూల్‌లో 100% ఆధునిక విద్యతో పాటు వైదిక విద్యనూ బోధిస్తారు. పతంజలి విశ్వవిద్యాలయంలో టీచర్లు, వైద్యులకు శిక్షణ ఇస్తున్నాం. దేశ వ్యాప్తంగా ప్రపంచస్ధాయి ప్రమాణాలతో 500 స్కూళ్ల ఏర్పాటు చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement