
మాట్లాడుతున్న డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ
నెల్లూరు(క్రైమ్): అంతా పాతికేళ్ల లోపు యువకులు. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఆటోల్లో తిరుగుతూ మొబైల్ వ్యభిచారం చేయించడం, ఒంటరిగా ఉన్న మహిళలపై లైంగిక దాడులు చేయడం, ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా హత్య చేయడంలో వెనుకాడని పరిస్థితిలో ఉన్నారు. గతేడాది ఓ మహిళను లైంగికంగా అనుభవించి దారుణంగా హత్య చేశారు. ఈ ఏడాది ఓ మహిళపై లైంగికదాడి యత్నంకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన కె. నాగేంద్ర, ఎ.క్రాంతి, టి శ్యామ్‌కుమార్, జి.రాము, కె.సునీల్, జి.నాగేంద్ర, జి.సుబ్రహ్మణ్యం, యు.చందు, అలీ స్నేహితులు. వీరందరూ చిన్నతనం నుంచే చెడు వ్యసనాలకు బానిసలయ్యారు.
తల్లిదండ్రులు వారిని పట్టించుకోవడంలేదు. దీంతో ఆటోల్లో మొబైల్ వ్యభిచారం చేయిస్తూ వచ్చిన సంపాదనను వ్యసనాలకు వెచ్చించేవారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఒంటరి మహిళలపై లైంగిక దాడులకు యత్నించేవారు. ఈ నేపథ్యంలో గతేడాది జనవరి 5వ తేదీన దుండగులు నగరంలో బాపట్లకు చెందిన ఓ మహిళను తమ ఆటోలో ఎక్కించుకొని మాగుంటలేఅవుట్ రైలు పట్టాల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై లైంగిక దాడిచేశారు. అనంతరం ఆమె వద్దనున్న వెండి పట్టీలు, కాలికున్న కడియం, కొంత నగదును దోచుకొని ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాల వద్ద నుంచి లాక్కొచ్చి సమీపంలోని కాలువలో పడేసి నిందితులు పరారయ్యారు. మృతదేహం తీవ్ర దుర్ఘందం వెదజల్లుతుండటంతో అదే నెల 7వ తేదీన స్థానికులు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మిస్టరీగా మారింది.
మహిళపై లైంగిక దాడియత్నం
ఇది ఇలా ఉండగా దుండగులు నగరంలో మరో ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఏడాది మే 15వ తేదీన చెన్నైకు చెందిన ఓ మహిళ, తన బంధువుతో కలిసి నెల్లూరుకు వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సుందర్ లాడ్జిలో అద్దెకు దిగారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు లాడ్జిలోకి వెళ్లారు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తిపై దాడి చేసి ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. దీంతో బాధిత మహిళ పెద్దగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారీ అవుతూ లాడ్జి మేనేజర్‌పై దాడి చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా మరో ఇద్దరు నిందితులు
మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితులైన టి. శ్యామ్‌కుమార్, జి. రామును దర్గామిట్ట పోలీసులు ఆదివారం పొదలకూరురోడ్డు సర్కిల్‌లో అరెస్ట్‌చేశారు. హత్య కేసులో మిగిలిన నిందితుల్లో అలీ ఇప్పటికే మృతి చెందారనీ, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. లాడ్జి ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న నలుగురిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. నిందితులపై ఇప్పటికే అనేక కేసులున్నాయని, వీరిపై రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో దర్గామిట్ట పోలీసుస్టేషన ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ జి. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై ఎం. పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
కేసులో చిక్కుముడి వీడింది ఇలా..
నగరానికి చెందిన కె.నాగేంద్ర, ఎ.క్రాంతి అనుమానాస్పదంగా తిరుగుతుండగా దర్గామిట్ట పోలీసులు గత నెలలో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించగా సుందర్ లాడ్జి ఘటనతో పాటు మాగుంట లేఅవుట్‌లో మహిళను హత్య చేసింది తామేనని నేరం అంగీకరించారు. లాడ్జి ఘటనలో తమతో పాటు శ్యామ్‌కుమార్, కె. సునీల్, ఖాదర్‌బాషా, కాలు, సునీల్ స్నేహితుడు పాల్గొన్నారని పోలీసులకు వెల్లడించారు. మహిళను హత్య చేసిన ఘటనలో తమతో పాటు శ్యామ్‌కుమార్, రాము, సునీల్, జి. నాగేంద్ర, జి. సుబ్రహ్మణ్యం, యు. చందు, అలీలు పాల్గొన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు అప్పట్లో కె. నాగేంద్ర, ఎ. క్రాంతిలను అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment