నెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన నెల్లూరులోని నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రాజీవ్‌గాంధీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, భర్త సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన శ్యామల (28)కు కోట బొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.లక్ష్మీనారాయణతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమ (ఐదో తరగతి), శివరామ్ (ఒకటో తరగతి) పిల్లలు న్నారు. ఏడాది క్రితం లక్ష్మీనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురై అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చేరాడు.
ఈ క్రమంలో శ్యామలకు తన స్వగ్రామానికి చెందిన సమీప బంధువు పి.రాజుతో స్నేహం మొదలైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం ఆస్పత్రిలో ఉన్న భర్త వద్దకు రాజును తీసుకువచ్చి మనకు అండగా ఉంటాడని చెప్పి అతనివద్దనే ఉంచింది. లక్ష్మీనారాయణ కోలుకునేంత వరకు రాజు అతనితోనే ఉన్నాడు. వైద్యశాల నుంచి డిశ్చార్జి అయిన కొద్దిరోజుల్లోనే శ్యామల, రాజుల ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. భార్యకు ఆమె కుటుంబసభ్యుల ద్వారా చెప్పించడంతోపాటు రాజును సైతం మందలించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. అప్పటికే లక్ష్మీనారాయణ అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో నెల్లూరులో నివాసం ఉంటున్న శ్యామల బంధువుల వద్దకు వెళ్లి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఏడునెలల క్రితం నెల్లూరుకు..
అప్పులు తీరుతాయని, మరోవైపు రాజు బాధ తప్పుతుందని భావించిన లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి ఏడునెలల క్రితం నెల్లూరుకు వచ్చాడు. కొత్తకాలువ సెంటర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బేల్దారి పనులు చేసుకోసాగాడు. ఈ క్రమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో రైస్‌మిల్లులో లక్ష్మీనారాయణ పనికి చేరాడు. అతనికి తెలియకుండా రాజు తరచూ నెల్లూరుకు వచ్చి శ్యామలతో మాట్లాడి వెళ్లేవాడు. కొంతకాలం క్రితం లక్ష్మీనారాయణ పనిపై శ్రీకాకుళం వెళ్లగా రాజు నెల్లూరుకు చేరుకుని అతనికి ఫోన్ చేశాడు. దీంతో భర్త విషయాన్ని శ్యామల బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వెళ్లి రాజును అక్కడినుంచి పంపివేశారు. లక్ష్మీనారాయణ నెల్లూరుకు చేరుకుని 15 రోజుల క్రితం కొత్తకాలువ వద్ద నుంచి కాపురాన్ని కిసాన్‌నగర్ రాజీవ్‌గాంధీకాలనీకి మార్చాడు. పిల్లల్ని స్థానికంగా ఉన్న మున్సిపల్ పాఠశాలలో చేర్పించాడు.
మందలించినా..
ఇటీవల రాజు నెల్లూరుకు రాగా లక్ష్మీనారాయణ అతడిని భార్యను మందలించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో శ్యామల కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు గ్రామానికి రావాలని సూచించడంతో పిల్లలు తీసుకుని అతను అక్కడకు వెళ్లారు. అప్పటికే శ్యామల వారి పుట్టింట్లో ఉంది. పెద్దమనుషులు శ్యామలను మందలించారు. ఫోనులో రాజును హెచ్చరించారు. శ్యామల మరోమారు ఇలా చేయనని చెప్పి భర్తతో కలిసి నెల్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తనతో రాకపోతే చంపేస్తానని, లేదంటే చచ్చిపోతానని రాజు బెదిరిస్తున్నాడని భర్తకు చెప్పింది. తనను వదిలేయమని రాజును ప్రాధేయపడింది.
రోకలిబండతో కొట్టి..
రాజు రెండురోజుల క్రితం నెల్లూరుకు చేరుకున్నాడు. బుధవారం లక్ష్మీనారాయణ పని నిమిత్తం రైస్‌మిల్లుకు వెళ్లడం, ఉమ టిఫిన్ కోసం వెళ్లడాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన తనతో వచ్చేయాలని రాజు శ్యామలను కోరాడు. ఆమె నిరాకరించడంతో రోకలిబండతో తలపై మోదాడు. దీంతో ఆమె తలపగిలి తీవ్రరక్తసావ్రం అవుతుండటంతో అక్కడినుంచి పరావుతూ రోకలిబండను ముళ్లపొదల్లో విసిరేశాడు. శ్యామల తనను కాపాడాలని పెద్దగా కేకలువేస్తూ ఇంట్లోనుంచి బయటకు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతిచెందింది. «శ్యామల హత్య ఘటనపై స్థానికులు నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.బాలసుందరరావు, నవాబుపేట ఎస్సైలు శ్రీహరి, ప్రతాప్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి భర్తను పిలిపించి హత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment