చంద్రగిరిలో ఎర్రదుంగలను పరిశీలిస్తున్న ఐజీ కాంతారావు
చిత్తూరు, పిచ్చాటూరు: రెండు వాహనాలు సహా 44 ఎర్రచందనం దుంగలు, స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డ సంఘటన మండలంలోని రెప్పాలపట్టు వద్ద చోటు చేసుకుంది. వివరాలను ఏఎస్‌పీ (ఆపరేషన్) క్రిష్ణార్జునరావు పిచ్చాటూరు పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. మంగళవారం సాయంత్రం రెప్పాలపట్టు వద్ద మండల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కేవీబీ పురం నుంచి వస్తున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు. అందులో 44 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వీటిని తరలిస్తున్న తమిళనాడు కాంచీపురంవాసులు యం.భాస్కర్(34), పుగయేంది(30), బి.ప్రభు (35), జె.హుస్సేన్ (32) నలుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఏఎస్‌పీ, పుత్తూరు రూరల్ సీఐ దైవప్రసాద్‌లు స్టేషన్‌కు చేరుకొని దుంగలను పరిశీలించారు. దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బంది భరత్, మణి, గణేష్‌లతో పాటు సీపీఓ లోకలకు ఏఎస్‌పీ రివార్డులు అందించి అభినందించారు. స్మగ్లర్‌లపై కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏఎస్‌పీ తెలిపారు. మావేశంలో ఎస్‌ఐలు రామాంజనేయులు, మల్లి ఖార్జున, వీరేష్, సిబ్బంది రామయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: శేషాచలం నుంచి అరుదైన ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన స్మగ్లర్ల నుంచి 11 దుంగలను టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఐ వాసు కథనం మేరకు... స్మగ్లర్ల ఉన్నట్లు రహస్య సమాచారంతో సోమవారం రాత్రి ఆర్‌ఎస్‌ఐ బృందం కూంబింగ్ ప్రారంభించింది.
మండల పరిధిలోని శేషాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున స్మగ్లర్ల జాడను టాస్క్‌ఫోర్స్ బృందం గుర్తించారు. అక్కడ నుంచి బయటకు వచ్చే మార్గంలో మరో బృందాన్ని పంపించారు. బీమవరం బీట్ నిలవరాతి కోన వద్ద స్మగ్లర్లు దుంగలు తీసుకెళ్లడం గమనించారు. అధికారులను గుర్తించిన స్మగ్లర్లు దుంగలను వెంటనే పడేసి పరుగులు తీశారు. సిబ్బంది 11 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐజీ కాంతారావు సంఘటన స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్న ఏ గ్రేడ్ దుంగలను పరిశీలించారు. చంద్రగిరి పట్టణానికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. సిబ్బందిని డీఐజీ అభినందించారు. కార్యక్రమంలో ఏసీఎఫ్ కృష్ణయ్య, ఆర్‌ఐ చంద్రశేఖర్, సీఐ కొండయ్య, ఎఫ్‌ఆర్‌ఓలు లక్ష్మిపతి, ప్రసాద్, ఎస్‌ఐ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment