వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కురబలకోట: కురబలకోట మండలంలోని రైల్వే స్టేషన్ బస్టాప్ సమీపంలో లారీలో తరలిస్తున్న ఎ ర్రచందనాన్ని ముదివేడు పోలీసులు పట్టుకున్నారు. గురువారం కడప నుంచి బెంగళూరుకు ఎర్రచందనంతో వెళుతున్న ఈలారీని హైజాక్ చేసేందుకు బొలెరోలో వచ్చిన మరికొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా ఊహించని విధంగా పోలీసులకు చిక్కారు . 4,253 కిలోల బరువున్న 146 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ముగ్గురు స్మగ్లర్లు పరారు కాగా డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్రచందనం పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీఐ మురళీ కృష్ణ, ఎస్‌ఐ నెట్టి కంఠయ్య, స్థానిక పోలీసులను అభినందించారు. గురువారం రాత్రి ఆయన ముదివేడు స్టేషన్‌లోని ఎర్రచందనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘కడప నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నట్లు ముదివేడు పోలీసులకు సమాచారం వచ్చింది. కురబలకోట రైల్వే స్టేషన్ బస్టాప్ సమీపంలో లారీని పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ఎన్. రాజును అరెస్టు చేశాం. ఇతను కర్ణాటకలోని అత్తులూర్‌లోని నార్త్‌కోడ్‌కు చెందినవాడు. ఎర్రచందనం తరలిస్తున్న లారీ నంబరు కూడా కర్ణాటకకు చెందినదే. లారీని సీజ్ చేసి స్మగ్లర్ల కోసం దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ పేర్కొన్నారు.
హైజాక్ చేసి...
కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఎర్రచందనం లారీని బొలోరా వాహనంలో వెంటాడిన స్మగ్లర్లు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. కురబలకోట రైల్వే బస్టాప్ సమీపంలో ఈ లారీకి బొలెరో వాహనాన్ని అడ్డుపెట్టి హైజాక్ చేశారు. అదే సమయంలో ఖాకీ డ్రస్సులో డ్యూటీకి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసుగా భావించి అటు లారీలోని వారు ఇటు బొలేరోలో వచ్చిన హైజాక్ ముఠా పరారయ్యారు. విషయాన్ని పసిగట్టి ఆర్టీసీ డ్రైవర్ ముదివేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి లారీని తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది.
జిల్లా ఎస్పీకి తొలికేసు..!!
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజే భారీ ఎర్రచందనం లారీ ముదివేడు పోలీసులకు పట్టుబడింది. ఇంత భారీ స్థాయిలో ఎర్రచందనం పట్టుబడటం ఇదే తొలిసారని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment