స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల వద్ద ఐజీ కాంతారావు
చిత్తూరు ,భాకరాపేట : భాకరాపేట ఘాట్ రోడ్డు మార్గంలోని అడవుల్లో తమిళ స్మగ్లర్లు భారీ స్థాయిలో విరుచుకుపడినట్లు టాస్క్ పోర్స్ ఐజీ కాంతారావు పేర్కొన్నారు. ఆయన కథనం..రహస్య సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి తిరుపతి టాస్క్ ఫోర్స్ బృందం, ఆర్‌ఎస్‌ఐ వాసు బృందం భాకరాపేట ఘాట్ రోడ్డుకు చేరుకుంది. వాహనాలు తనిఖీలు చేస్తూ అటవీ ప్రాంతాన్ని నిశితంగా గమనించసాగారు. అయితే అడవిలో నుంచి మినుకు మినుకు మంటూ వెలుతురు వస్తుండడంతో అనుమానించారు.
ఆ వైపు వెళ్లి పరిశీలించారు. 30 మంది వరకు అడవిలో నడుస్తూ వెళుతున్నట్లు గుర్తించి, వారిని పట్టుకునేందుకు యత్నించారు. వారు దుంగలు పడేసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో దుంగల వద్ద కొంతమంది సిబ్బందిని కాపలా ఉంచి వారిని వెంబడించారు. మరో వైపు నుంచి శబ్దం రావడంతో అటుకేసి పరుగులు తీశారు. సుమారు 40–50 మంది వరకు ఉన్న స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌పై దాడికి తెగబడ్డారు. రాళ్లు, గొడ్డళ్లు, కత్తులు విసరడంతో టాస్క్ ఫోర్స్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపింది. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటన స్థలంలో 55 దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరో 3 దుంగలను గుర్తించింది. ఇవన్నీనూ ఏ–1 గ్రేడ్ కలిగినవి కావడం గమనార్హం!
కొనసాగుతున్న కూంబింగ్
పరారైన స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా శేషాచలం అటవీ సరిహద్దు గ్రామాలు, భాకరాపేట, ఎర్రావారిపాళెం మండలాల్లోని చెక్ పోస్టులు, సీసీ కెమెరాల పుటేజీలను ఎప్పటికప్పుడు తీసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్‌ఓలు లక్ష్మీపతి, ప్రసాద్, సీఐ కొండయ్య, ఆర్‌ఐ భాస్కర్, ఎస్‌ఐ సోమశేఖర్‌తోపాటు డాగ్ స్క్వాడ్, నైట్ పెట్రోలింగ్ స్క్వాడ్, వాసు బృందం పాల్గొంది.
స్మగ్లర్ల సంచుల్లో వన్య ప్రాణులకళేబరాల అవశేషాలు!
స్మగ్లర్లు ఎప్పుడు పట్టుబడినా ఆహార పదార్థాలు, బట్టలు లభించేవి..అయితే ప్రస్తుతం బ్యాగుల్లో జంతు కళేబరాల అవశేషాలు (కొండముచ్చు కాళ్లు, చిన్న కోతి చర్మం, బెట్లుడత తోక), వీటితో పాటు తుపాకీ గుండ్లకు ఉపయోగించే సీసం స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే స్మగ్లర్లు, ఎర్రకూలీలు మారణాయుధాలతో సంచరిస్తూ వన్యప్రాణులను కూడా వేటాడుతున్నట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment