గాల్లోకి కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఐజీ కాంతారావు టాస్ప్‌ఫోర్స్ బృందం
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం బండకొండ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆత్మ రక్షణ కోసం గాలిలోకి కాల్పులు జరిపినట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు. బుధవారం గాల్లోకి కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఐజీ కాంతారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి అందిన సమాచారం మేరకు చిన్నగొట్టిగల్లు మండలం కటారువాండ్లపల్లె సమీ పంలోని బండకొండ ప్రాంతంలో స్మగ్లర్లు కదలికలను గమనించి కూంబింగ్ నిర్వహించామన్నారు. అక్రమ రవాణాకు అనువైన రోడ్డు మా ర్గానికి దగ్గరగా బండకొండ ప్రాంతం ఉండడంతో అక్కడ ఎర్రచందనం దుంగలను నిల్వ చేసి, వాటిని తరలించేందుకు సిద్ధం అవుతుండగా వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా రాళ్లు విసురుతూ పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. ఒక దశలో వారు ఎదురు తిరిగి దాడికి పాల్పడేందుకు ముందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో దుంగలు కింద పడేసి పారిపోతుండగా తమిళనాడు రాష్ట్రం జువాదిమళైకి చెందిన సెల్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో 13 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సరిహద్దు గ్రామాల్లో భయం భయం
చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల సరిహద్దు ప్రాంతమైన బండకొండ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలు తరలించిన దాఖలాలు లేవని స్థానిక గ్రామ ప్రజలు అంటున్నారు. టాస్క్‌ఫోర్స్, డాగ్ స్క్వా డ్, పోలీసులు గ్రామాల సరిహద్దులోని పొలా ల్లో తిరగడంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
కొనసాగుతున్న కూంబింగ్
బండకొండ సమీపంలో పారిపోయిన స్మగ్లర్లు కోసం తలకోన అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో స్మగ్లర్లు బరితెగిస్తున్నారంటే కచ్చితంగా ఇంటి దొంగలు సహకారం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ దిశగా కూడా రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment