లారీలో ఉన్న బియ్యం బస్తాలు, వంట సామగ్రి,
తిరుపతి సిటీ: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చిన ఎర్ర కూలీలు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పోలీసులను లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దుండగులు లారీలోంచి దూకడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తిరుచానూరు ఫ్‌లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగింది. టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు కథనం మేరకు.. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన లారీలో నిత్యావసర వస్తువులు తీసుకుని ఎర్ర కూలీలు శేషాచలం అడవుల్లోకి ప్రవేశించేందుకు వస్తున్నట్లు సీఐకి సమాచారం అందింది. అప్రమత్తమైన ఆయన తన సిబ్బందితో వడమాలపేట టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దీన్ని గమనించిన ఎర్ర కూలీలు లారీని ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు.
సీఐ వెంటనే గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. వారు జాతీయ రహదారిలో ఏర్పాటుచేసిన బారికేడ్లను దుండగులు ఢీకొని వెళ్లిపోయారు. గమనించిన పోలీసులు తిరుచానూరు, తిరుపతి పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. అప్రమత్తమైన తిరుచానూరు పోలీసులు ఫ్‌లైఓవర్ బ్రిడ్జి వద్ద బారికేడ్లను పెట్టి లారీని నిలిపే ప్రయత్నం చేశారు. లారీ వేగంగా వచ్చి బారికేడ్లను సైతం లెక్కచేయకుండా గుద్దుకుని ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో అక్కడ రెండు లారీలు ఢీకొని ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని ఎర్ర కూలీలు పసిగట్టారు. లారీని ఓటేరు మార్గంలో రోడ్డుపై నిలిపి కిందకు దూకేశారు.
ఈ క్రమంలో గాయాలపాలయ్యారు. వారిని వెంబడిస్తూ వస్తున్న తిరుచానూరు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. రుయాకు తరలించి వైద్య సేవలు అందించారు.
చెరుకు కొట్టాలని చెప్పిఅదుపులోకి తీసుకున్న వారిలో రవి అనే కూలీ మాట్లాడుతూ చెరుకు కొట్టాలని చెప్పి తమను లారీ ఎక్కించారని తెలిపాడు. తరువాత ఎర్రచందనం చెట్లు నరకాలని చెప్పారని పేర్కొన్నాడు. లారీలో బియ్యం బస్తాలు, ఇతర వంట సామగ్రి, గొడ్డళ్లు, పూజ సామగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో దొరస్వామి(41), ఎం.రవి (28), గోవిందస్వామి (28), చక్రవర్తి (28), కార్తీక్ (28), తిరుపతి (28), వేదనాయగం (41) ఉన్నారు. వీరు తమిళనాడు జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవారుగా టాస్క్‌ఫోర్స్ పోలీసుల గుర్తించారు. ఎర్ర కూలీలను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్ సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment