ఎర్ర కూలీలతో డీఎఫ్‌ఓ గురుప్రభాకర్, ఫారెస్టు అధికారులు, సిబ్బంది
ప్రొద్దుటూరు టౌన్: ఖాజీపేట మండలం నాగసానిపల్లె అటవీ రేంజ్ పరిధిలో ఈ నెల 23న అర్థరాత్రి అటవీ సిబ్బంది దాడి చేసి 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారని డీఎఫ్‌ఓ గురుప్రభాకర్ తెలిపా రు. అలాగే 27 మంది ఎర్ర కూలీలు పట్టుబడ్డారని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ రాత్రి అటవీ సిబ్బంది కాపు కాశారని అన్నారు. అర్థరాత్రి 12–1 గంట ప్రాంతంలో కూలీలు ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ క్రమంలో తమ సిబ్బంది చాకచక్యంతో వారిని పట్టుకున్నారన్నా రు. ఈ దాడిలో తమిళనాడులోని కులవకుర్చి విల్లుపురం, వెల్లోరి జిల్లాలకు చెందిన 25 మంది తమిళకూలీలతో పాటు ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఖాదర్‌బాద్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.50 కోట్ల విలువ
47 ఎర్రచందనం దుంగలు మొదటి రకానికి చెందినవని డీఎఫ్‌ఓ తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 1.50 కోట్లని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ అబ్బాస్ కోసం వేట సాగిస్తున్నామన్నారు. ఈ దొంగలకు స్థానిక ఖాదర్‌బాద్‌కు చెందిన వారితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అబ్బాస్‌తో పాటు, వీరిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. దొంగల వద్ద దొరికిన ఆధారాల మేరకు అబ్బాస్ నుంచి స్థానికులకు ఫోన్ కాల్స్ వచ్చాయని, వీరి నుంచి కూడా అబ్బాస్‌కు కాల్స్ వెల్లినట్లు తేలిందని వివరించారు. ఎర్ర దొంగలను పట్టుకున్న వారిలో డిప్యూటీ రేంజ్ అధికారి కరిముల్లా, డీబీఓ ఎమ్.లింగానాయక్, శ్రీనివాస్, రమేష్‌బాబు, రతన్‌రాజు, ఏబీఓలు గంగాధర్,బ్రహ్మయ్య బి.ఉషా, లింగారెడ్డి, గురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment