ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను విచారిస్తున్న కమిటీ సభ్యులు
తిరుపతి అర్బన్/పీలేరు: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం ఎస్వీ మెడికల్ కాలేజిని కుదిపేసింది. ఎట్టకేలకు బాధ్యులైన ఇద్ద రు ప్రొఫెసర్లను ప్రభుత్వం నెల్లూరు బది లీ చేసింది. ప్రిన్సిపల్ రమణయ్యను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.బుధవారం ఉదయం బాధ్యులైన ప్రొఫెసర్లను అరెస్టు చేయాల్సిందేనని విద్యార్థులు భీష్మించారు. కలెక్టరు స్వయంగా వచ్చి తన డిమాండ్లపై చర్చించాలనంటూ నిరసించారు. వైద్యాధికారులతో, విద్యార్థులతో హైపవర్ కమిటీ తొలుత జరిపినచర్చలు ఫలప్రదం కాలేదు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలి సింది. శిల్ప ఆత్మహత్యపై హైపవర్ కమిటీతో పాటు సీఐడీ కూడా దర్యాప్తు చేయనుంది. సీఐడీ స్పెషల్ బ్రాంచి పోలీసులు విద్యాసంస్థను సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. గత నివేదికలను పరిశీలించి ప్రిన్సిపల్ రమణయ్య నుంచి కూడా తీసుకున్న వివరాలను వీరు ప్రభుత్వానికి పంపనున్నారని భోగట్టా.
కన్నీటి వీడ్కోలు..
డాక్టర్ శిల్పకు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. పీలేరు మండలం మొరవపల్లె వద్ద దహన క్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కారకులైన ప్రొఫెసర్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారకులైన ప్రొఫెసర్లను అరెస్ట్ చేయాలని పీలేరు ఆర్టీసీ బస్టేషన్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శిల్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరా టాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రొఫెసర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్, పురుషోత్తం, వెంకటేష్ తదితర విద్యార్థి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేసినాన్యాయం జరగలేదు..
రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ శిల్ప తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హడావుడి చేసి చివరకు ప్రాణాలు బలిగొన్నారన్నారు. జీవితాంతం తలుచుకొని బాధపడాల్సిందేనని, ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నివేదిక బయట పెట్టకుండా వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్లకు అండగా నిలవడం దారుణమన్నారు. డాక్టర్ శిల్ప భర్త, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బుధవారం పీలేరులోని శిల్ప ఇంటికి వచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు, ప్రొఫెసర్ల వేధింపులపై వివరాలు సేకరించారు. ప్రొఫెసర్లను అరెస్ట్ చేయిస్తామని చెప్పాలని కోరగా నన్నపనేని సమాధానం దాటవేశారు. పీలేరు ఇన్‌చార్జి సీఐ సిద్ధతేజమూర్తి, ఎస్‌ఐలు పీవీ సుధాకర్‌రెడ్డి, రామస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment