చిత్తూరు అర్బన్: ‘శిల్ప పిడియాట్రీషియన్ చదువుతున్న వైద్యురా లు. కళాశాలలో అధ్యాపకుల వేధింపులు తాళలేక వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. మానసికంగా కుంగిపోయి తన వద్దకు వచ్చేవారికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కల్పించాల్సిన వైద్యురాలి బలవన్మరణంతో సమస్యలు తీరిపోయాయా..? తీరినా పోయిన ప్రాణం తిరిగొచ్చిందా..?’
‘నిన్నటికి నిన్న తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. పరీక్షలకు భయపడో, వ్యక్తిగత సమస్య ఏదైనా ఆమెను ఆత్మహత్మకు పురుగొలిపి ఉండవచ్చని స్నేహితులు భావిస్తున్నారు. భర్త మృతితో కుంగిపోయిన గీతిక తల్లి బిడ్డ చదువు కోసం చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకుని తిరుపతి వచ్చేశారు. ప్రాణం తీసుకోవాలనుకున్న మానసిక సంఘర్షణలో తల్లి పడ్డ కష్టాన్ని గీతిక గుర్తుకు తెచ్చుకోలేకపోయారు.’
వీరిద్దరే కాదు.. చిన్నపాటి సమస్యకే కుంగిపోయి ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తున్నవారి సంఖ్య జిల్లాలో ఇటీవల ఎక్కువైంది. అది కూడా విద్యావంతులు, వృత్తిపరంగా రాణిస్తున్నవారు, నలుగురికీ ధైర్యం చెప్పి సమాజాన్ని నడిపించాల్సిన వారే ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చదవులు, వేధింపులు, ఒత్తిడి, ప్రేమ.. కారణం ఏదైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. చమటోడ్చి, కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం పూలబాటగా మారుతుంది.
లక్ష్యం గుర్తుంచుకోవాలి
ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని విద్యతో వికసింప చేసుకోవాలని ఆశిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చదువుల్లో ఎదుగుతూ గమ్యం వైపు నడవాలని ప్రయత్నిస్తారు. ఈ సమయంలో అడుగులు తడబడడం, ఒత్తిళ్లు, ఆకర్షణ, వేధింపులు ఇలా అనేకం ఎదురవుతాయి. జీవితమంటేనే పోరాటం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోరాటం చేసి విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం అంతాఇంతాకాదు. అంతేగాని సమస్య వచ్చిందని మానసికంగా కుంగిపోయి జీవితాన్ని అర్ధంతరంగా ముగించడం మంచిదికాదు. చనిపోవడం ఒక్కటే పరిష్కారమని భావించేవాళ్లు ఒక్క క్షణం ఆలోచిస్తే గమ్యం.. గమనం తప్పకుండా మారతాయి. జీవిత లక్ష్యాలు, తల్లిదండ్రులు, వారు పడుతున్న కష్టాన్ని తరచూ మననం చేసుకోవడం వల్ల ఆత్మహత్య ఆలోచనల నుంచి బటయపడొచ్చు. జీవితం ఆనందంగా సాగుతుంది.
ఒత్తిళ్లు ఇలా దూరం..
♦ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉటుంది. విద్యార్థులయితే నిరంతరం ప్రణాళికతో అభ్యసనం చేయాలి. దైన్నైనా ఆశావహ దృక్పథంతో తీసుకుని ముందుకు సాగాలి. ఏదైనా ఒక అంశం సరిగ్గా రాకపోతే రెండు మూడు సార్లు ప్రయత్నించడం వల్ల ఫలితం సాధించవచ్చు.
♦ ప్రతి విషయాన్ని ఒత్తిడిగా భావించి కుంగిపోకూడదు. ఇప్పుడున్న యువత ప్రతి ఒక్క విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. చనిపోవాలనే పరిస్థితులు ఎదురైనప్పుడు తమ భావాలను ఎవ్వరితోనూ పంచుకోలేకపోతున్నారు. మన సమస్యను నమ్మకస్తుల వద్ద పంచుకుంటే మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు ఉప్పొంగి బయటికొస్తే బాధ దూరమవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి.
♦ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనిషికి చదువు సంస్కారాన్ని నేర్పుతుందనే విషయాన్ని మరచిపోవద్దు. సమాజంలో ఎలా బతకాలో నేర్పించేది చదువు.
♦ బాధ ఉన్న సమయంలో చిన్నపిల్లలు ఉన్న చోట ఆడుకోవడం, అన్నీ మరచిపోయి వారితో కాసేపు సరదాగా గడపడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని ఇటీవల పరిశోధనలు రుజువు చేశాయి.
♦ ప్రధానంగా సామాజిక మాధ్యమాలను మనకు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. అనవసరమైన చర్యలు, సంబంధంలేని విషయాలను వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేగాక మనపై ఒత్తిడి పెంచుతుందనే విషయాన్ని గుర్తించాలి.
తల్లిదండ్రులే ప్రధానం
దేశాన్ని మార్చే శక్తి యువతలోనే ఉంది. సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించేది కూడా యువతే. అలాంటప్పుడు విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి..? లక్ష్యంవైపు అడుగులు వేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వాటి పరిష్కారానికి ప్రయత్నించాలి. లేదంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. ప్రపంచంలో అమ్మానాన్నలు మాత్రమే మీ సమస్యను పరిష్కరిస్తారు, దారి చూపిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. – డాక్టర్ పి.సరళమ్మ,జిల్లా ప్రభుత్వ వైద్యశాలలసమన్వయాధికారిణి
చర్చించండి
మూడేళ్లలో మహిళలపై జరిగిన వేధింపుల కేసులు 1,372 నమోదయ్యాయి. అందులో ఈ ఒక్క ఏడాదిలోనే 2,083 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వేధింపులు పెరిగాయని కాదు. మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి వారి సమస్యలు చెబుతున్నారు. పరిష్కారాలు చూపిస్తున్నాం. సమస్య ఉంటే అమ్మా, నాన్న, స్నేహితులతో చర్చించాలి. గుడికి వెళ్లి దేవుడికి దన్నంపెట్టి బాధను చెప్పుకున్నట్లే ధైర్యంగా స్టేషన్‌కు రండి. రోడ్డుపై భిక్షమెత్తుకునే 90 ఏళ్ల వృద్ధురాలికి కూడా సమస్య ఉంది. అలాగని ఆమె ఆత్మహత్య చేసుకోలేదే. దయచేసి బతుకుపై ఉన్న ధైర్యాన్ని వదలొద్దు. – నారాయణస్వామిరెడ్డి,మహిళా స్టేషన్ డీఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment