శిల్ప, గీతిక (ఫైల్)
తిరుపతి అర్బన్ : మెడికోల వరుస బలవన్మరణాలతో తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఉలిక్కిపడింది. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక బలవన్మరణం విద్యార్థులను, వైద్యులను కలవరపాటుకు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అశువులు బాయటం సర్వత్రా ఆందోళనకు తావిస్తోంది. భావి డాక్టర్ల బలవన్మరణాలు సమాజాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. మెడికల్ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఇంటర్నల్ పరీక్షలు..
మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం పాథాలజీ అంశంలో ఇంటర్నల్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గీతిక మృతితో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశముందని వైద్య విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. పరీక్షలకు భయపడేంత విధంగా ఇంటర్నల్ పరీక్షలు జరగవని జూడాల నాయకులు చెబుతుండగా, పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులకు భయపడి గీతిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా...? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కళాశాలలోనూ గీతిక ఎక్కువగా ఎవరితోనూ కలివిడిగా ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు.
భరోసా ఇచ్చే చర్యలు శూన్యం..
ఒక్క ఎస్వీ మెడికల్ కళాశాలలోనే కాకుండా ఏ విద్యా సంస్థలోనైనా, విధి నిర్వహణ ప్రాంతా ల్లోనైనా వేధింపులు ఎదురైనప్పుడు వారికి భరోసా కలిగించే చర్యలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుత ఈ రెండు ఘటనలే నిదర్శనాలుగా నిలిచాయి. ఏదో ఘటన జరిగిన సందర్భంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణ మవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆత్మహత్యలకు వ్యతిరేకంగాఅవగాహన కల్పించాలి..
కళాశాలల్లో, విధి నిర్వహణ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేలా నిరంతరం అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ధైర్యం నూరిపోయాలి. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలూ శ్రీకారం చుట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ప్రద్యుమ్న సూ చించిన వేధింపుల నివారణ కమిటీల ఏర్పాటునూ వేగవంతం చేయాలన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అవసరమైతే ఈ అంశాలను హైస్కూల్ స్థాయిలోని పాఠ్యాంశాల్లోనే చొప్పించాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment