సాక్షి, తిరుపతి: తన భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముందే స్పందించివుంటే ఆమె బతికేదని డాక్టర్ శిల్ప భర్త రూపేశ్ అన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ శిల్పను చిన్నచూపు చూశారని వెల్లడించారు. మానసిక సంఘర్షణకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకునివుంటే శిల్ప ఆత్మహత్య చేసుకునేది కాదని ఆమె తండ్రి రాజగోపాల్ అన్నారు. తమను పరామర్శించిన వివిధ సంఘాల నాయకులతో వారు మాట్లాడారు.
ఏడాదిన్నర పోరాడింది
చిన్నప్పటి నుంచి శిల్పను గారాబంగా పెంచుకున్నామని, గోల్డ్ మెడల్ విద్యార్థి కావడంతో మెడిసిన్ పూర్తి చేసిందని రాజగోపాల్ తెలిపారు. పీజీ కోర్సు కూడా అయిపోతే తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆశించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుపై శిల్ప ఫిర్యాదు చేసిందని, ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకునివుంటే తమకు కడుపుకోత మిగిలేది కాదన్నారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న అన్యాయాలపై ఏడాదిన్నరగా శిల్ప పోరాడుతూనే ఉందని, ఎన్నోమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. మే నెలలో గవర్నర్ కూడా ఫిర్యాదు చేసిందని, దీంతో కక్ష కట్టి పరీక్షల్లో శిల్పను ఫెయిల్ చేశారని ఆరోపించారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు.
ఇద్దరిపై కేసులు
డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతంలో ఆమె సోదరి శృతి ఫిర్యాదు మేరకు రవికుమార్, కిరీటి శశికుమార్ లపై కేసులు నమోదు చేసినట్టు పీలేరు సిఐ సిద్ధ తేజోమూర్తి తెలిపారు. ఐపీసీ 354 డీ,509, 506, 306, 34 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టినట్టు వెల్లడించారు. కాగా, శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఎస్వీ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
డాక్టర్ శిల్ప ఫిర్యాదు చేసినప్పుడే స్పందించివుంటే ఇంత అమానుషం జరిగేది కాదని మహిళా ఐక్యవేదిక, సీపీఎం అనుబంధ సంస్థ ఐద్వా సభ్యులు అన్నారు. శిల్పను నమ్ముకున్న కుటుంబ సభ్యులు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా శోకం మిగిలిందని పేర్కొన్నారు. శిల్ప కుటుంబ సభ్యులను శనివారం మహిళా సంఘాల ప్రతినిధులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment