డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు, సీపీఐ నాయకులు
చిత్తూరు, మదనపల్లె క్రైం : అయిన వాళ్లే తనను మోసగించి ముంబయిలోని వేశ్యాగృహానికి అమ్మేశారని, ఏడాదిన్నరపాటు అక్కడ చిత్రహింసలు అనుభవించి ఎలాగో తప్పించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చానని బాధితురాలు వాపోయింది. ఆమె గురువారం తనకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీ చిదానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. మదనపల్లె డివిజన్‌లోని కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (25)ని ఆరేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన మల్లికార్జునకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు వంశీ పుట్టాడు. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల తర్వాత సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ మఠంవడ్డిపల్లెకు చెందిన దంపతులు సల్లాపురి, యల్లమ్మ కుమారుడు రెడ్డెప్పను రెండో వివాహం చేసుకుంది. వీరు కొంత కాలానికి మదనపల్లె అనపగుట్టలో స్థిరపడ్డారు. ఆ సమయంలో రెడ్డెప్ప తండ్రి సల్లాపురి చనిపోవడంతో తిరిగి మకాంను స్వగ్రామానికి మార్చాడు.
అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో వరుసకు మరిది అయిన నరసింహులు, అతని భార్య అరుణ కలిసి రెడ్డెప్ప ఇంటిలో లేని సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చారు. మెలకువ వచ్చి చూడగా ముంబయిలోని వేశ్యం గృహంలో ఉంది. ఏడాదిన్నరపాటు వేశ్యావృత్తిలో చిత్రహింసలు అనుభవించింది. అదేవిధంగా మరో ముగ్గురు మహిళలు వైశ్యాగృహం నుంచి తప్పించుకోబోయి నిర్వాహకులు తీసిన కరెంటు ఉచ్చులో పడి మృతి చెందారని బాధితురాలు తెలిపింది. దీంతో భయపడి తాను తప్పించుకోవడానికి మార్గాలు వెతికి ఆరు రోజుల క్రితం అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలిపింది. అనంతరం భర్త ఉన్న చోటును తెలుసుకుని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో సీపీఐ నాయకుల సహాయంతో ఇక్కడికి వచ్చినట్టు పేర్కొంది. తనలాగా మరెందరో మహిళలు వేశ్యాగృహాల్లో మగ్గుతున్నారని కన్నీటిపర్యంతమైంది. స్పందించిన డీఎస్పీ కిడ్నాప్ చేసిన ప్రాంతం సోమల మండలానికి చెందినది కావడంతో అక్కడి డీఎస్పీ, సీఐలతో మాట్లాడి బాధితురాలిని సోమలకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment