మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం | Three People Died in Road Accident Chittoor | Sakshi
Sakshi News home page

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

Published Fri, Sep 6 2019 1:08 PM | Last Updated on Fri, Sep 6 2019 1:08 PM

Three People Died in Road Accident Chittoor - Sakshi

సహదేవ మృతదేహం వద్ద విలపిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు

చిత్తూరు ,మదనపల్లె టౌన్‌ : లారీ డ్రైవర్‌ మితిమీరిన వేగానికి ఓ భవన నిర్మాణ కార్మికుడు బలయ్యాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. గురువారం ఈ సంఘటన మదనపల్లె లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం..తంబళ్లపల్లె మండలం ఎరమద్దివారిపల్లెకు చెందిన టి.సహదేవ(42) బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. బెంగుళూరు రోడ్డులో ఉన్న నక్కల దిన్నె తాండాలో నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహదేవ  గురువారం ఉదయం కురబలకోట మండలం అంగళ్లులో భవన నిర్మాణ పనులకు కోటవారిపల్లెకు చెందిన నరసింహులు(37)ను తీసుకుని తన మోటార్‌ సైకిల్‌లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్‌యార్డు సమీపాన ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ  స్పీడు బ్రేకర్ల వద్ద బైక్‌పై నెమ్మదిగా వెళుతుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ సహదేవ, నరసింహులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో సహదేవ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నరసింహులును అక్కడి ప్రజలు ఆటోలో హుటా హుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్‌ఐ సోమశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భాగ్యమ్మ, పిల్లలు తనుజ, జయశ్రీ తమ బంధువులతో అక్కడికి చేరుకుని ‘ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు..
వాల్మీకిపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని చింతపర్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఎగువబూడిదవేడుకు చెందిన ఆవుల ద్వారకనాథ రెడ్డి (32) చింతపర్తి బాహుదానది బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితుది తల నుజ్జునుజ్జై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కారు ఢీకొని మహిళ మృతి
బంగారుపాళెం: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు బైపాస్‌రోడ్డుపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ కథనం.. చీకూరుపల్లెకు చెందిన లేట్‌ లక్ష్మయ్య భార్య లక్ష్మమ్మ(56)పొలం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళుతున్న  కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement