రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుల నరకయాతన.. | 2 Died And 40 Injuried In Bus Accident In Chittoor | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఎంతఘోరం!

Published Thu, Jan 9 2020 8:25 AM | Last Updated on Thu, Jan 9 2020 8:28 AM

2 Died And 40 Injuried In Bus Accident In Chittoor - Sakshi

రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వైద్యులు

పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు, అటెండెంట్‌ దుర్మరణం పాలయ్యారు. 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 34 మంది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వారు, విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, జిల్లాకు చెందిన నలుగురు, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నారు. 

సాక్షి, చంద్రగిరి/తిరుపతి: మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునే వేళ చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు పీడకలగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, ఆర్టీసీ ఓల్వో బస్సు ప్రమాదం తాలూకు క్షతగాత్రుల హాహాకారాలతో కాశిపెంట్ల దద్దరిల్లింది. కృష్ణా జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, సహాయకుడు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలవడం స్థానికులను దిగ్భ్రాంతి కలిగించింది. ఆర్టీసీ రెండవ డ్రైవర్‌ సత్యనారాయణ దీనికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలారు. అమరావతి నుంచి కుప్పంకు బయల్దేరిన ఏపీ16 జెడ్‌ 0586 ఓల్వో బస్సును కాశిపెంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ ఓల్వో స్లీపర్‌ బస్సు ఢీకొని ముందరి భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అవడం చూస్తే పూర్తిగా డ్రైవర్‌ నిర్లక్ష్యమేనని ప్రమాదం తీవ్రత అద్దం పట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా, దిండి మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులతో శబరిమల యాత్ర ముగించుకుని తిరుమలకు వస్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్స్‌ సర్వీసు అమరావతి నుంచి కుప్పంకు వెళ్తున్న ఆర్టీసీ ఓల్వో బస్సును ఢీకొంది.

(చదవండి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం)

తిరుపతిలో డ్యూటీకి ఎక్కిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రమేష్‌తోపాటు సహాయకుడు ప్రసాద్‌ తీవ్రగాయాలతో మరణించారు. బస్సు ముందరి భాగం నుజ్జైన ధాటికి తీవ్రగాయాల పాలై, కేబిన్‌లోనే  ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్‌ లక్ష్మీనారాయణ ఇరుక్కుపోయాడు. ఆర్టీసీ ఓల్వో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, ప్రైవేటు బస్సులో 32 మంది అయ్యప్పస్వాముల తలలకు గాయాలవడంతోపాటు కొందరికి చేతులు, కాళ్లు విరిగిపోవడంతో నరకయాతన అనుభవించారు. వారి హాహాకారాలు, ఆర్తనాదా లకు కాశిపెంట్ల వాసులు అక్కడికి పరుగులు తీశారు. క్షతగాత్రులను శ్రమలకోర్చి పోలీసులు స్థానికులు, ఇతర ప్రయాణికుల సహకారంతో వెలికి తీసి తిరుపతికి తరలించారు. 

క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు
కాశిపెంట్ల ప్రమాద క్షతగాత్రులకు రుయా ఆస్పత్రి అత్యవసర విభాగంలో వైద్యసేవలు హుటాహుటిన అందించారు. రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణయ్య పర్యవేక్షణలో సీఎంవోలు, విభాగాధిపతులు, రుయా అధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యపరీక్షలు చేయడంతోపాటు చికిత్స చేశారు. 


ఇద్దరి పరిస్థితి విషమం
ఆర్టీసీ ఓల్వో బస్సు డ్రైవర్‌ రమేష్, అటెండెంట్‌ ప్రసాద్‌ మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని చెన్నై, హైదరాబాద్, నెల్లూరుకు తరలించారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ పళణి చెన్నై ఆస్పత్రికి, ఇదే యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ఉషాకిరణ్‌ను నెల్లూరుకు తరలించారు. రుయాలో 28 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 19 మంది ఆర్థో వార్డు, ముగ్గురు చిన్నపిల్లల ఆస్పత్రి, ఆరుగురు జనరల్‌ సర్జరీలో వైద్యసేవలు పొందుతున్నారు. తీవ్రంగా గాయపడి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ డ్రైవర్‌ లక్ష్మీనారాయణ, జయపాల్‌ పరిస్థితి విషమంగా ఉందని రుయా సూపరింటెండెంట్‌ తెలిపారు. ఇదలా ఉంచితే, క్షతగాత్రుల్లో  తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.10 వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 2వేల చొప్పున అందజేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎంవో చంగల్‌రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్‌ చైర్మెన్‌ బండ్ల చంద్రశేఖర్‌ సొంత డబ్బులతో అల్పాహారం, ఫ్లూయిడ్స్‌ను అందజేశారు..

నిర్లక్ష్యమే కారణం?
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా, దిండికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌ సర్వీసు డ్రైవర్‌ లక్ష్మీనారాయణ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఇంత ఘోరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిబంధనల ప్రకారం రోడ్డుకు ఎడమ వైపు వెళ్తుండగా. ప్రైవేటు ట్రావెల్స్‌  బస్సు డ్రైవర్‌ తాను నడుపుతున్న వాహనాన్ని రోడ్డులో కుడివైపు వెళ్లి, ఆర్టీసీ ఓల్వోను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రోడ్డు ఆరు లేన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్‌ తాను వస్తున్న మార్గం ఆరులేన్లదిగా భావించి, కుడివైపు వాహనాన్ని నడిపినట్లు అధికారులు భావిస్తున్నారు. విశ్రాంతి లేకుండా వారం రోజులుగా వాహనాన్ని నడుపుతుండడంతో తెల్లవారిజామున కునుకు తీసి కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

దురదృష్టకరం : కలెక్టర్‌
రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా వ్యాఖ్యానించారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌తో కలసి క్షతగాత్రులను రుయా ఆస్పత్రి లో ఆయన పరామర్శించి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నామన్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదానికి పూర్తి కారణాలు తెలుసుకుని ఆదిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

గాయపడిన బాలికలు, మరో బాధితుడిని రుయా ఆస్పత్రిలోకి తీసుకెళుతున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement