
కలికిరి ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల స్నేహితులను విచారిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాసులు
చిత్తూరు, కలికిరి : నర్సింగ్ విద్యార్థినులు, అక్కాచెల్లెళ్లు పట్నం తస్లీం(19), పట్నం షికాబి(18)లు సోమవారం ఆత్మహత్యకు చేసుకున్న విషయం విదితమే. వీరి మృతదేహాలకు మంగళవారం ఉదయం కలికిరి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను చూసి స్నేహితులు బోరున విలపించారు. శవపరీక్ష అనంతరం పోలీసులు యువతుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.
బలవన్మరణానికి కారణాలేంటి..?
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా వారి సున్నిత మనస్తత్వమే కారణమని భావిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు వేర్వేరు తరగతులైనా చాలా అన్యోన్యంగా ఉండేవారని తెలుస్తోంది. అక్క తస్లీం ఇంటర్ పరీక్షల్లో తప్పడంతో మనస్తాపం చెంది, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేమన్న బంధంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం, ఇంకేదైనా కారణమా.. అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు చదువుతున్న కళాశాలలో వారి స్నేహితులు, వసతిగృహం వార్డెన్ తదితరులను మంగళవారం ఎస్‌ఐ శ్రీనివాసులు విచారించారు.