
బత్తల వెంకటరమణమ్మ, పీట్ల అనిత
చిత్తూరు, తిరుపతి క్రైం: సాధారణ ప్రయాణికుల్లా నటిస్తూ బస్సులు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో మహిళల హ్యాండ్ బ్యాగులు, పర్సులు చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు క్రైం అడిషనల్ ఎస్పీ డి.సిద్ధారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. టీటీడీకి చెందిన మాధవం వసతి సముదాయాల సమీపంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నట్టు సమాచారం అదిందన్నారు.
క్రైం డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ భాస్కరెడ్డి బృందం అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. విచారణలో వారు కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురానికి చెందిన సముద్రాల ఫిలిప్స్ భార్య బత్తల వెంకటరమణమ్మ అలియాస్ సముద్రాల సంగీత (22), పీట్ల సుధాకర్ కుమారై పీట్ల అనిత(19)గా తేలిందని పేర్కొన్నారు. వీరు హైదరాబాద్, రాజంపేట, తిరుపతి, తిరుమల తదితర నగరాల్లో చోరీలు చేసి అరెస్టయ్యారని తెలిపారు. పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు అనేక కేసుల్లో నిందుతులుగా ఉండి తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు. వీరిపై తిరుపతిలోని స్టేషన్లతోపాటు కడపలోనూ కేసులు ఉన్నట్టు తెలిపారు. వారి నుంచి రూ.8.73 లక్షల విలువ చేసే 286 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment