
తిరుపతిలో కెమెరాలు ఏర్పాటుచేస్తున్న పోలీసులు
నేర నియంత్రణలో అర్బన్ జిల్లా కొత్తపుంతలు తొక్కుతోంది. హైటెక్ టెక్నాలజీతో ఇప్పటికే అర్బన్ పోలీసులు ముందంజలో ఉన్నారు.తిరుపతిలోని సీసీ కెమెరాలను రాష్ట్రంలోనేనెంబర్ వన్‌గా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్బన్ జిల్లాపరిధిలో 2వ కమాండెంట్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్బన్ జిల్లాఅంతటా ఈ నిఘానేత్రాలు విస్తరించనున్నాయి. జిల్లాకు వచ్చే భక్తులు, ప్రజలకు మరింత భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ.. శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. నెల రోజుల్లో తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లోని రెండో అంతస్తులో అధికారికంగా ఈ నిఘా నేత్ర కేంద్రాన్ని ప్రారంభించేందుకుఎస్పీ అభిషేక్ మొహంతి సిద్ధం చేసుకున్నారు.
తిరుపతి క్రైం: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని భద్రతానగరంగా తీర్చిదిద్దే పని చురుగ్గా సాగుతోంది. 2012లోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుపతి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు కెమెరాలను ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్‌ను ఆధునీకరించేందుకు 2014లో రూ.50 లక్షలు ప్రభుత్వం కేటా యించింది. అదే ఏడాది డిసెంబరులో సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్‌ను ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో వీడియో వాల్‌తో అప్పటి డీజీపీ జేవీ రాముడు ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలోని 59 ప్రధాన సర్కిల్స్‌లో 324 సీసీ కెమెరాలున్నాయి. ఇందులో హై టెక్నాలజీ కలగిన 41 జూమింగ్ కెమెరాలు ప్రధాన సర్కిళ్లలో ఏర్పాటయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 285 కెమెరాలను ఏర్పాటు చేశారు. అభిషేక్ మొహంతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 150 కెమెరాలు ఏర్పాటు కావడం విశేషం. గతంలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాలైనచెర్లోపల్లి నుంచి పద్మావతిపురం వరకు ఉన్న చాముండేశ్వరీ ఆలయం, వైకుంఠపురం, అవిలాల, ఉప్పర పల్లి, ఆంధ్రాబ్యాంక్ కాలనీ, పద్మావతిపు రం, శ్రీనివాసపురం, కేశవాయని గుంట, ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేశారు.
నూతన కెమెరాల వివరాలు
♦ అర్బన్ జిల్లా పరిధిలో 852 సీసీ కెమెరాల్లో వివిధ రకాలు ఉన్నాయి. ఇందులో ఆర్‌ఎల్‌వీడీ సీసీ కెమెరాలు 33, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద రెడ్ లైట్ పడి ముందుకు వెళ్లిన వాహనాలను గుర్తిస్తాయి.
♦ ఎన్‌పీఆర్ సీసీ కెమెరాలు 250 ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఆటోమేటిక్‌గా వాహన నెంబర్ ప్లేట్లు గుర్తిస్తాయి.
♦ ఎఫ్‌ఆర్‌ఎస్ సీసీ కెమెరాలు 103 ఏర్పాటు చేయనున్నారు. ఇవి మనిషి ముఖాన్ని పూర్తిస్థాయిలో గుర్తించగలవు.
♦ 58 వీడీఏ సీసీ కెమెరాలు నిరంతరం వీడియోలు తీస్తాయి. బస్టాండ్, ఆలయాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి వీడియో తీసిన సమయంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగు, వాహనాలు, వస్తువులు ఉంచి ఆపై నిర్ణీత గడువులోపల తీసుకోకపోతే అలాంటి వస్తువును ఇది గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
♦ 200 జనరల్ సర్వైలెన్స్‌లు సాధారణ కెమెరాల్లా పనిచేస్తాయి.
♦ 208 పీటీజెడ్ కెమెరాలు అత్యంత నాణ్యత కల్గిన ఫొటోలను తీయగలవు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, రంగంపేట, వడమాలపేట ప్రాంతాల్లో 500, నగరంలో మరో 300 ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ప్రవేశించే ప్రతి వాహనాన్ని, వ్యక్తిని గుర్తించే లక్ష్యంగా పోలీసులు వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఏపీ ఫైబర్‌తో అనుసంధానం
అర్బన్ జిల్లా పరిధిలో సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రం విజయవాడలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంలో ఉంది. ప్రభుత్వం రియల్‌టైం గవర్నెన్స్ లింక్ (ఆర్‌టీజీ) కలిగి ఉంటుంది. తిరుపతిలోని సీసీ కెమెరాల నిఘా కల్గిన ప్రతి ప్రాంతాన్ని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా పరిశీలించవచ్చు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న నిఘాకేంద్రాన్ని ఆర్టీజీకి అనుసంధానం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment